Interfaith marriage: జార్ఖండ్‌కి చెందిన ముస్లిం యువకుడు, హిందూ అమ్మాయిలకు సొంత రాష్ట్రంలో బెదిరింపులు ఎదురుకావడంతో కేరళ వీరి అండగా నిలిచింది. జార్ఖండ్‌కి చెందిన మహ్మద్ గాలిబ్, ఆశా వర్మలు ప్రేమించుకున్నారు. వీరిద్దరి మతాలు వేరు కావడంతో వారి కుటుంబాల నుంచి పొరుగువారి నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. ‘‘లవ్ జిహాద్’’కి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో బెదిరింపులు ఎక్కువ అయ్యాయి.
జార్ఖండ్ చితార్‌పూర్‌కి చెందిన ఈ జంట ఫిబ్రవరి 9న కేరళలోని అలప్పుజలోని కాయంకుళం చేరుకుంది. వీరికి కేరళ ఆశ్రయం కల్పిస్తోంది. మొదటి వీరు ఫిబ్రవరి 11న స్థానిక మసీదులో ఇస్లామిక్ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు, ఆ తర్వాత ఫిబ్రవరి 16న హిందూ సంప్రదాయం ప్రకారం గుడిలో పెళ్లి చేసుకున్నారు. మతాంతర సంబంధం కావడంతో ఇద్దరి కుటుంబాలు, పొరుగువారు వీరి వివాహాన్ని వ్యతిరేకించారు.
గాలిబ్ గతంలో యూఏఈలో పనిచేశాడు. అక్కడే పరిచయమైన మిత్రుడు కేరళ వెళ్లాలని సలహా ఇవ్వడంతో, ఈ జంట ఆ రాష్ట్రానికి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఆశా కుటుంబం జార్ఖండ్ పోలీసులు కలిసి వీరిని ఫాలో చేశారు. అయితే, కాయంకుళం చేరుకుని తాము పోలీస్ స్టేషన్‌ని చేరారు, తాము మేజర్లమని, తమ ఇష్టాపూర్వకంగా కలిసి జీవించే హక్కు ఉందని స్పష్టం చేశారు. ఆశాని ఒప్పించేందుకు విఫలమైన బంధువులు తిరిగి వెళ్లిపోయారు.
గాలిబ్ మాట్లాడుతూ, “మా ఇద్దరిపైనా ఎవరి ఒత్తిడి లేదు. పూర్తి సమ్మతితో పెళ్లి చేసుకున్నాము. అయినప్పటికీ, కిడ్నాప్ కోసం నాపై తప్పుడు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. పోలీసులు ఇప్పటికే ఆశా స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. అయినప్పటికీ, ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయబడి ఉంది’’ అని చెప్పాడు. వీరిద్దరు గత 10 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు తేలింది. పాఠశాల రోజుల నుంచి ఒకరికిఒకరు తెలుసు. జార్ఖండ్‌లో పొరుగువారిగా ఉన్నారు. గాలిబ్ గత నెలలో యూఏఈ నుంచి భారత్ వచ్చాడు. వీరిద్దరి మతాలు వేరు కావడంతో రెండు కుటుంబాలు సంబంధాన్ని అంగీకరించలేదు. బెదిరింపులకు భయపడిన జంట, న్యాయవాది గయా ఎస్ లత ద్వారా కేరళ హైకోర్టుని ఆశ్రయించి, రక్షణ కోసం రిట్ పిటిషన్ దాఖలు చేశారు.