వేసవికాలం వచ్చిందంటే చాలు.. మామిడి పండ్ల హంగామా మొదలైపోతుంది. రాక రాక ఏడాదికి ఒకసారే మార్కెట్‌లోకి వస్తాయి కాబట్టి, మామిడి ప్రియులు వీటిని కొనుగోలు చేసేందుకు ఎగబడతారు. అంత, ఇంత అని మోతాదు చూసుకోకుండా.. ఎక్కువ స్థాయిలో తినేస్తారు. మరి, ఇలా విరగబడి తినడం కరెక్టేనా? ఆరోగ్యానికి మంచిదేనా? అంటే.. అవుననే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎన్ని ఎక్కువ తిన్నా, వీటి వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవని చెప్తున్నారు. ఈ పండ్లలో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో పౌషకాలు ఉంటాయని, బాగా తినొచ్చని సూచిస్తున్నారు. ఇంతకీ ఈ పండ్లలో ఏముంటాయో ఓ లుక్కేద్దామా?
1. విటమిన్ ఏ + సీకెరోటినాయిడ్స్: ఇవి శరీరంలోని రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.
2. పొటాషియం + మెగ్నీషియం: ఇవి రక్తపోటు సమస్యను అదుపులో ఉండచంలో కీలక పాత్ర పోషిస్తాయి.
3. ఐరన్ క్యాల్షియం: రక్తహీనత సమస్య నుంచి బయటపడేయడమే కాకుండా, ఎముకల దృఢత్వానికి దోహద పడుతుంది
4. ఫైబర్: జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి, మలబద్దకం సమస్యను నివారిస్తుంది. శరీర బరువు తగ్గించడంలోనూ ఈ పండ్లు సహాయపడతాయి.
5. యాంటీ ఆక్సిడెంట్స్: క్వార్సెటిన్ (క్యాన్సర్ కణాలను నశింపచేస్తుంది), ఫిసెటిన్, ఐసోక్వెర్సిటిన్, ఆస్ట్రాగాలిన్, గాలిక్ యాసిడ్, మిథైల్ గాలేట్ మొదలైనవి క్యాన్సర్ నిరోధకాలుగా పని చేస్తాయి.
కేవలం మామిడికాయ మాత్రమే కాదండోయ్.. మామిడి ఆకులతోనూ ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మధుమేహ సమస్యతో బాధపడేవారు.. 5 లేదా 6 ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం పరగడుపున తాగితే, చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. ఇంకేం ఆలోచిస్తున్నారు.. ఈ సీజన్‌లో ఎన్ని వీలైతే అన్ని తినేయండి, ఆరోగ్యంగా ఉండండి.