జుట్టు సంరక్షణ కోసం సహజమైన వస్తువులను ఉపయోగించాలి. జుట్టు పెరుగుదలకు గుడ్డు ఎల్లప్పుడూ ఉత్తమ ఎంపిక. గుడ్డులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టును ఒత్తుగా, బలంగా, మెరిసేలా చేయడంలో సహాయపడతాయి. గుడ్లలో ప్రోటీన్, బయోటిన్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణ అందించడంలో సహాయపడతాయి. జట్టు రాలడాన్ని నివారిస్తాయి. కానీ.. జుట్టు పెరుగుదల విషయంలో గుడ్డులోని పచ్చసొన లేదా తెల్లసొన దానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది? అని ఆలోచిస్తుంటారు. ఈ రెండింటి వల్ల కూడా లాభాలు ఉన్నాయి. ఇది మీ జుట్టు అవసరాలపై ఆధారపడి ఉంటుంది.
గుడ్డు పచ్చసొన ప్రయోజనాలు..
గుడ్డు పచ్చసొనలో బయోటిన్, విటమిన్లు ఎ, డి, ఇ, ఫోలేట్, కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి జుట్టుకు మెరుగైన పోషణను అందిస్తాయి. గుడ్డు పచ్చసొనలో ఉండే కొవ్వు ఆమ్లాలు, కొలెస్ట్రాల్ జుట్టును హైడ్రేట్ చేసి తేమగా మారుస్తుంది. ఇది పొడి, చిక్కులు పడిన జుట్టును మృదువుగా, మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే బయోటిన్, ప్రొటీన్ స్కాల్ప్ ను హెల్తీగా మార్చుతుంది. ఇది జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది.
తెల్లసొన ప్రయోజనాలు..
గుడ్డు తెల్లసొనలో చాలా ప్రోటీన్ ఉంటుంది. ఇది బలహీనమైన, సన్నని జుట్టును బలపరుస్తుంది. గుడ్డులోని తెల్లసొన జుట్టుపై ఉన్న అదనపు నూనెను తొలగించి తలని శుభ్రంగా ఉంచుతుంది. దీంతో జుట్టు మరింత ఆరోగ్యంగా కనిపిస్తుంది. అలాగే, ఇందులో ఉండే ప్రొటీన్ జుట్టు మూలాలకు బలాన్ని అందిస్తుంది. జుట్టు రాలకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే పోషకాలు జుట్టు పెరగడానికి తోడ్పడతాయి.
ఏది ఎంచుకోవాలి?
మీ జుట్టు పొడిగా ఉన్నట్లయితే.. గుడ్డు పచ్చసొన ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జుట్టుకు మంచి పోషణ, తేమను అందిస్తుంది. మీ జుట్టు జిడ్డుగా లేదా సన్నగా ఉంటే.. గుడ్డులోని తెల్లసొన మరింత ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇది అదనపు జిడ్డును తొలగిస్తుంది. జుట్టును బలపరుస్తుంది. మీరు మీ జుట్టుకు పూర్తి పోషణను అందించాలనుకుంటే.. రెండింటీని కలిపి ఉపయోగించుకోవచ్చు.
ఎలా ఉపయోగించాలి?
గుడ్డు పచ్చసొన హెయిర్ మాస్క్: 1-2 గుడ్డు సొనలను 1 టీస్పూన్ కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెతో కలపండి. దీన్ని జుట్టు, తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత కడగాలి.
ఎగ్ వైట్ హెయిర్ మాస్క్: 1-2 గుడ్డులోని తెల్లసొనలో నిమ్మరసం కలపండి. దీన్ని తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.