Broken Heart Syndrome: మీరు ఎప్పుడైనా, ఎవరినైనా ప్రేమించారా? అలా ప్రేమించినట్లు అయితే.. ఒకసారి అనుకోండి అలా.. మీకు పొరపాటున లవ్ బ్రేకప్ జరిగితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. వాస్తవానికి మీకు ప్రేమ విఫలమైనప్పుడు మీ గుండె బద్దలైనట్లు ఎప్పుడైనా అనిపించిందా? దిగమింగుకోలేనంత ఏడుపు రావడం, కాళ్ల కింద భూమి కదులుతున్నట్లు, తల తిప్పుతున్నట్లు అనిపించిందా? ఒక క్షణం ఆగండి.. అసలు ఇప్పుడు మీ శరీరంలో ఏం జరుగుతోందో తెలుసా…
బాధగా ఎందుకు అనిపిస్తుంది?
వాస్తవానికి మనిషికి అంత ఎక్కువగా బాధ రావడానికి కారణాలను స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఒక అధ్యయనం చేసింది. ప్రేమలో ఉండేటప్పుడు శరీరంలో డోపమైన్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటున్నట్లు ఈ అధ్యయనంలో తేలినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు పరిశోధకులు మాట్లాడుతూ.. మన మూడ్‌ను ప్రభావితం చేయడంలో డోపమైన్ ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. మెదడులో దీని స్థాయిలు ఎక్కువగా ఉంటే మన మూడ్ కూడా చాలా బావుంటుందని తెలిపారు. అయితే మన శరీరం నొప్పిని భరించే స్థాయినీ డోపమైన్ ప్రభావితం చేస్తుందని ఆ అధ్యయనంలో తేలిందని పరిశోధకులు చెప్పారు.
మీకు ఉన్నది బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్..
అసలు గుండె బద్దలైనట్లు ఎందుకు అనిపిస్తుందో హృద్రోగ నిపుణులు ఈ విధంగా చెప్పారు. ‘‘దీనికి కారణం బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్. దీన్నే టకసుబో సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక తీవ్రమైన గుండె జబ్బు లాంటిది. మహిళల్లో ఎక్కువగా ఇది కనిపిస్తుంది. ఈ సిండ్రోమ్‌తో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చే రోగుల్లో 90 శాతం మంది మహిళలే ఉంటారు. బహుశా మహిళల్లో భావోద్వేగాలు కాస్త ఎక్కువగా ఉండటమే దీనికి కారణం కావచ్చు’’అని వాళ్లు చెప్పారు. బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్‌తో బాధపడే వారి మెదడులోని కొన్ని భాగాల్లో చర్యలు మందగిస్తాయి. దీంతో శరీరంలోని కొన్ని స్పందనలను నియంత్రించే శక్తి తగ్గిపోతుంది’అని వాళ్లు వివరించారు.
బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్‌తో బాధపడేవారిలో గుండె నిర్మాణంలో మార్పులు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇలాంటి వ్యాధితో బాధపడే వారికి సాధారణంగా కంటే గుండె కాస్త ఎక్కువగా వ్యాకోచిస్తుందని పేర్కొన్నారు. ఈ సిండ్రోమ్‌ను మొదట 1990ల్లో జపాన్‌లో గుర్తించారు. రక్త నాళాల్లో ఎలాంటి అడ్డంకులు లేనప్పటికీ గుండె పోటు వచ్చినట్లుగా అనిపిస్తోందని కొందరు రోగులు చెప్పడంతో ఈ రుగ్మతపై వైద్యులు మొదటిసారిగా పరిశోధన చేపట్టారు. ఈ వ్యాధితో బాధపడే చాలా మంది రోగులు కొన్ని రోజులు లేదా కొన్ని వారాల్లో సాధారణ స్థితికి వచ్చేస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. కానీ కొన్ని కేసుల్లో మరణం వరకూ కూడా పరిస్థితులు దిగజారొచ్చని హెచ్చరిస్తున్నారు.
హార్ట్‌బ్రేక్ సమయంలో మెదడులో చాలా మార్పులు జరుగుతుంటాయని పరిశోధనల్లో తేలిందని పలువురు వైద్యులు చెబుతున్నారు. ఈ మార్పుల వల్ల శరీరంలో కొన్ని భాగాలు బిగుసుకుపోయినట్లు అనిపిస్తుందని అంటున్నారు. ఎందుకంటే ఈ సమయంలో ఒక అసాధారణ పరిస్థితికి మెదడు స్పందిస్తోందని పేర్కొన్నారు. ఈ సమయంలో సాధారణంగా చాలా మందికి వాళ్లు కలిసుండేటప్పుడు తీసుకున్న ఫోటోలు, ఇతర సోషల్ మీడియా ఫీడ్‌ను చూడాలని అనిపిస్తుందని, దీని కారణంగా నొప్పి మరింత ఎక్కువ అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సంఘటనలతో బాధపడుతున్న వాళ్లు కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని చెబుతున్నారు.
పలువురు వైద్య నిపుణులు మాట్లాడుతూ.. హార్ట్‌బ్రేక్ ద్వారా వచ్చే నొప్పి చాలా మంది విషయంలో చాలా బాధాకరంగా ఉంటుందని అంటున్నారు. వాస్తవానికి మీరు ఎవరినైనా మనసాక్షిగా ప్రేమించాలి నిర్ణయం తీసుకున్నప్పుడు.. హార్ట్‌బ్రేక్ నుంచి వచ్చే నొప్పికి కూడా సిద్ధపడాలని సూచిస్తున్నారు. దీనికి వేరే ప్రత్యామ్నాయం లేదని వాళ్లు చెప్పారు.ఎందుకంటే ప్రేమ అనేది మెదడుకు ఒక వ్యసనం లాంటిదని వివరించారు. ఒక వ్యక్తిని వ్యసనానికి అలవాటు పడినట్లుగా ప్రేమించినప్పుడు మెదడు ప్రతి చిన్న విషయాన్ని రిజిస్టర్ చేసుకుంటుంది. అంటే భవిష్యత్ హార్ట్‌బ్రేక్ ముప్పును మీరు తీసుకుంటున్నారనే విషయాన్ని గుర్తుకు ఉంచుకోవాలని వివరించారు. అందుకే ప్రేమలో విఫలమైనప్పుడు మానసిక వైద్యుల దగ్గరకు వెళ్లాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
బ్రేకప్ అయితే అంత నొప్పి ఎందుకు ఉంటుంది..
శరీరానికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు లేదా నొప్పి వచ్చిన సందర్భంలో మన మెదడులోని ‘‘ఎంటీరియర్ సింగులేట్ రిడ్జ్’’గా పిలిచే భాగం యాక్టివేట్ అవుతుంది. ఇదే విధంగా మానసిక వేదన సమయంలోనూ ఇది స్పందిస్తుంది. కానీ ఇక్కడ మానసిక వేదన అనేది శారీరక నొప్పుల కంటే చాలా భిన్నమైనది పరిశోధకులు చెబుతున్నారు. బ్రేకప్ తర్వాత వచ్చే మానసిక వేదన అనేది ఎలాంటి నొప్పి నివారిణులు లేకుండా బిడ్డకు ప్రసవం ఇవ్వడంతో సమానమని పరిశోధకులు పేర్కొన్నారు. మరికొందరు దీన్ని కీమోథెరపీ ప్రభావాలతోనూ పోల్చారు.
READ ALSO: Ayodhya: అయోధ్యలో 26 లక్షల దీపాలు.. రెండు గిన్నీస్ రికార్డులు