ఇజ్రాయెల్ రూపంలో ఓ వైపు గాజాకు ప్రమాదం పొంచి ఉంటే.. తాజాగా ఇప్పుడు మరో వైపు నుంచి కూడా ప్రమాదం పొంచి ఉంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులతో గాజా అల్లాడిపోతుంది. గజగజవణికిపోతుంది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఇలాంటి తరుణంలో డీహెచ్‌వో మరో బాంబు పేల్చింది. గాజా మురుగునీటి నమూనాల్లో పోలియో సంబంధమైన వైరస్ అవశేషాలు ఉన్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో 10 లక్షల టీకాలను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది.
ఇప్పటివరకు పోలియో కేసు నమోదు కాలేదని.. తక్షణమే చర్యలు తీసుకోకపోతే వేలాది మంది చిన్నారులు ఈ వ్యాధి బారినపడే సమయం ఎంతో దగ్గరలో లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ స్పష్టం చేశారు. యుద్ధం కారణంగా గడిచిన తొమ్మిది నెలలుగా వ్యాక్సిన్ పంపిణీకి ఆటంకాలు ఎదురవుతున్నాయని.. దీంతో ఐదేళ్లలోపు చిన్నారులకు ఈ వ్యాధి ముప్పు అధికంగా ఉందన్నారు. రెండేళ్లలోపు శిశువులకు మరింత ప్రమాదకరంగా మారనుందని వెల్లడించారు.
గాజాలో నెలకొన్న పరిస్థితులతో చిన్నారులకు పోలియో ముప్పుతో పాటు హెపటైటిస్ (ఏ) కేసుల సంఖ్య కూడా భారీగా పెరగొచ్చని ఇటీవల ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. గత అక్టోబర్ నుంచి గాజా-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది.