ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టి పది రోజులైంది. పుతిన్ బలగాలను ఉక్రెయిన్ సైన్యం, పౌరులు కలిసికట్టుగా ఎదిరిస్తున్నారు. అయినా ప్రత్యర్థి దేశంలోని ఒక్కో నగరాన్ని, పట్టణాన్ని వ్యూహాత్మక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాడు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి ఇంకా అమెరికా, నాటోపై ఆశ చావలేదు.
ఓ వైపు ఉక్రెయిన్‌లో యుద్ధ బీభత్సం సృష్టిస్తూనే రష్యా మరోపక్క చర్చలు జపం చేస్తోంది. రష్యా చర్యను ఇప్పటికే మెజార్టీ దేశాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఐక్యరాజ్య సమితి వేధికగా దాడిని ఖండించాయి కూడా. దీనిపై సమితి తీర్మానం కూడా చేసింది. పశ్చిమ దేశాలు అత్యంత కఠినమైన ఆర్థిక ఆంక్షలతో పుతిన్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రష్యా ఇప్పుడు ఆర్థికంగా, రాజకీయంగా, న్యాయపరంగానూ ప్రపంచంలో ఒంటరైంది.
ఉక్రెయిన్‌పై దాడిని ప్రపంచమంతా ఖండిస్తున్నా వ్లాడిమీర్ పుతిన్ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. తగ్గే అవకాశాలు కూడా కనిపించట్లేదు. అంతేకాదు.. ఇప్పటి వరకు జరిగింది కేవలం ట్రైలరే ..ముందు ముందు అసలు సినిమా చూపిస్తా అన్నట్టుంది ఆయన తీరు. కాబట్టి ఈ యుద్ధానికి ముగింపు ఎలా ఉండబోతోందో ఊహించటం కష్టం. కచ్చితంగా ఏం జరబోతోందో జోస్యం చెప్పలేం గానీ దీనికి ఎలాంటి ముగింపు ఉంటుందో అంతర్జాతీయ వ్యవహారల నిపుణులు వివిధ రకాల అంచనాలకు వచ్చారు.
ఉక్రెయిన్ మౌళిక సదుపాయాలను ఒక్కొక్కటిగా రష్యా ధ్వంసం చేస్తోంది. రాజధాని కీవ్ రష్యా స్వాధీనంలోకి రావటానికి ఎంతో సమయం పట్టదు. అధ్యక్షుడు జెలెన్‌స్కీని చంపటమో, దేశం విడిచి పారిపోయేలా చేయటమో చేస్తారు. తరువాత అక్కడ తమ కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పడుతుంది. రష్యా తన దాడులను మరింత ఉధృతం చేసి కీవ్‌ను స్వాధీనం చేసుకోవచ్చు. ఉక్రెయిన్ మిలిటరీని ఓడించవచ్చు గాక. మరి తరువాత ఏంటి? సువిశాల ఉక్రెయిన్‌ను రష్యా ఎలా నియంత్రించగలుగుతుంది ? అందుకు రష్యా వద్ద ముందస్తు ప్రణాళిక ఉందా? ఉందని నిపుణులు భావించడం లేదు.
అయితే.. ఉక్రెయిన్‌ను నియంత్రించటానికి రష్యా బలగాలు మరికొంత కాలం అక్కడే తిష్టవేస్తాయి. క్రమంగా రష్యాకు అది మరో బెలారస్ అవుతుంది. ఇందులో పుతిన్ విజయం సాధించవచ్చు. కానీ ఆ ప్రభుత్వానికి చట్టబద్ధత ఉండదు. పశ్చిమ దేశాల మద్దతుతో మళ్లీ తిరుగుబాట్లు జరిగే అవకాశాలుంటాయి. ఆ ప్రభుత్వం అస్థిరపడుతుంది.
మరోవైపు రష్యా దాడిని తిప్పికొట్టేందుకు వేలాదిగా ఉక్రేనియన్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. యుద్ధం చేసేందుకు సిద్ధమైన పౌరుల చేతికి సైన్యం ఆయుధాలు అందించింది. కనుక చాలా కాలం దేశంలో తిరుగుబాట్లు తప్పవు. ఫలితంగా, రష్యా, ఆమెరికా అధిపత్య పోరులో ఉక్రెయిన్ రావణ కాష్టంలా కాలుతూనే ఉంటుంది.
దౌత్యంతో కూడా ఈ యుద్దానికి ముగింపు పలకవచ్చు. దౌత్య పరంగా తమ డిమాండ్లు సాధ్యం కాకపోతే వాటిని సాధించే వరకు సైనిక చర్య కొనసాగుతుందని పుతిన్ తేల్చి చెప్పాడు. ఉక్రెయిన్ తటస్థీకరణ, నిరాయుధీకరణను పుతిన్ కోరుకుంటున్నాడు. వాటి చుట్టే చర్చలు జరగాలని పుతిన్ ఖరాకండిగా చెపుతున్నారు.
నిజానికి, ఈ పరిస్థితులలో దౌత్య పరిష్కారానికి ఇంకా అవకాశం ఉందా అనే అనుమానం కలుగుతుంది. కానీ, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ మాటలను ఇక్కడ గుర్తుచేసుకోవాలి “ఇప్పుడు తుపాకులు మాట్లాడుతున్నాయి. కానీ చర్చల మార్గం ఎల్లప్పుడూ తెరిచే ఉండాలి” అని అన్నారాయన. కనుక చర్చలు తప్పకుండా కొనసాగుతాయి. ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో పురోగతి లేకపోవచ్చు కానీ భవిష్యత్‌లో ఏదైనా సాధ్యమే. ఐతే, ఇది పూర్తిగా పశ్చిమ దేశాల చేతిలోనే ఉంది. ఆంక్షలు తొలగించాలంటే రష్యా అధ్యక్షుడితో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకుంటారనేది ముఖ్యం.
ఒకవేళ ఈ యుద్ధంలో పుతిన్ ఓటమి పాలయ్యే పరిస్థితే వస్తే మరింత తెగించే అవకాశం ఉంది. అణ్వాయుధాలను ప్రయోగించవచ్చు. ఇప్పటికే పుతిన్ తన అణు బలగాలను అత్యున్నత స్థాయిలో అప్రమత్తం చేశారు. తమపై అణు దాడిని నిరోధించేందుకు వాటిని సిద్ధంగా చేసినట్టు చెప్పారు. కానీ ఇప్పటి వరకు పుతిన్ ఏదీ చెప్పింది చెప్పినట్టు చేయలేదని ఇటీవలి పరిణామాలను చూస్తే అర్థమవుతుంది.
పుతిన్‌ను తొలగించి రష్యా లో నాయకత్వం మార్పు. రష్యా సైన్యం ముందు అనుకున్నదానికంటే బలహీనంగా కనిపిస్తోంది. పుతిన్ మద్దుతో ఎదిగిన రష్యాలోని కుబేరులు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. వేలాది మంది రష్యన్ ప్రజలు వీధుల్లోకి వచ్చి ఇప్పటికే నిరసన తెలుపుతున్నారు. దేశంలో సైనిక పాలన విధిస్తారనే వార్తలు కూడా చక్ర్లు కొడుతున్నాయి.ఐతే, రష్యా అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ ఈ వార్తలను తోసిపుచ్చారు. పుతిన్ ను అధికారం నుంచి తొలగించి అతనికి భిన్నమైన ఆలోచనలు కలిగిన, పశ్చిమ దేశాల పట్ల విపరీత స్థాయిలో విముఖత లేని నేతను రష్యాలో గద్దెనెక్కించటం. ఇలా జరిగే అవకాశాలు చాలా చాలా తక్కువే కావచ్చు. అయినా ఇదికూడా నిపుణుల అంచనాలలొ ఒకటి.
మరో అంచనా ఏమిటంటే ఈ యుద్ధం రష్యాను బాగా కుంగదీస్తుంది. ఆంక్షలతో ఆ దేశం తీవ్రంగా దెబ్బతింటుంది. పుతిన్ పట్ల ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. చైనా జోక్యం చేసుకుంటుంది. రాజీ చేసుకోవాలని రష్యాపై ఒత్తిడి తెస్తుంది. యుద్దం ఇంకా ముదిరితే రష్యా చమురును, గ్యాస్‌ను తాను కొనబోనని బెదిరిస్తుంది. దీంతో పుతిన్ ఇందులో నుంచి బయటపడే మార్గం కోసం వెతుకుతాడు.
ఇక చివరి అవకాశం మూడో ప్రపంచ యుద్ధం. ఉక్రెయిన్ మీద రష్యా అదే పనిగా బాంబుల వర్షం కురిపిస్తూ వేలాది మంది ప్రజలను చంపుకుంటూ పోతే పశ్చిమ దేశాలు జోక్యం చేసుకుంటాయి. అప్పుడు నాటో దేశాలు, రష్యా మధ్య యుద్దం మొదలవుతుంది.
వీటన్నిటిలో కాల్పుల విరమణ ఒక్కటే ఓక్కువ అవకాశం ఉన్న మార్గం ..జెలెన్ స్కీని స్థానంలో తన తోలుబొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్టించటానికి ముందు రష్యా దళాలు నెమ్మదిగా మొత్తం ఉక్రెయిన్‌పై నియంత్రణ సాధిస్తుంది. ఆ సమయానికి ఉక్రెయిన్ ప్రజలు యుద్ధంతో విసిగి వేసారి పోతారు. అప్పడు వారు రాజీ మార్గాన్ని ఎంచుకోవచ్చు. వారు మాత్రం ఎంతకాలమని బంకర్లలో తలదాచుకుంటారు. అయితే, ఒక్కటి మాత్రం నిజం, ఈ యుద్ధం ఎలా ముగిసినా ప్రపంచ క్రమం (వరల్ ఆర్డర్) మాత్రం మునుపటిలా యథాతథంగా ఉండదు. వివిధ దేశాలతో రష్యా సంబంధాలు మారుతాయి. భద్రతకు సంబంధించి యూరప్ దేశాల వైఖరి కూడా పూర్తిగా మారుతుంది.