ప్రస్తుతం దేశంలో పెట్రోలు రేట్లు మండిపోతున్నాయి. చమురు ధరలు రోజూ పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొన్ని రోజుల క్రితమే పెట్రోల్, డీజిల్ రేట్లు సెంచరీ దాటేశాయి. దేవుడా.. బండి అనవసరంగా కొన్నామని కొందరు.. తప్పడం లేదు అని కొందరు నెత్తి బాదుకుంటూనే వాహనాలను నడుపుతున్నారు. అయితే ఈ రేట్లు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉన్నాయి. మనకంటే ఎక్కువ ధరలు ఉన్న దేశాలు కొన్ని ఉండగా.. కొన్ని దేశాల్లో లీటర్ పెట్రోల్ ధర చాక్లెట్ కన్నా చీఫ్ గా ఉన్నాయి. మరి ఆ దేశాలు ఎక్కడ ఉన్నాయి.. ఎందుకు అక్కడ అంత చీప్ అనేది తెలుసుకుందాం రండి.
వెనిజులా.. దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న ఈ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత చీప్ అంటే కేవలం లీటర్ పెట్రోల్ అక్కడ రూ.1.50 మాత్రమే.. షాకింగ్ గా ఉంది కదా.. నిజమే ఎందుకంటే ఆ దేశంలో చమురు నిక్షేపాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే అక్కడ పెట్రోల్ చాలా చవకగా దొరుకుతుంది. ఇక ఈ దేశం తరువాత పెట్రోల్ తక్కువగా దొరికే దేశాలు ఇరాన్, సిరియా, కువైట్, నైజీరియా.. ఈ దేశాలు చమురు నిల్వలు ఎక్కువగా ఉండడంతో ఇక్కడ కేవలం రూ. 40 ల లోపే పెట్రోల్ దొరుకుతుంది.
పెట్రోల్ ధరలు మన దేశంలో మండిపోతున్నాయి అంటే పొరపాటే.. మనకంటే ఎక్కువగా పెట్రోల్ కి డబ్బులు చెల్లిస్తున్న దేశం హాంకాంగ్. ఇక్కడ లీటర్ పెట్రోల్ అక్షరాలా రూ. 193. ఇక్కడ చమురు నిల్వలు ఎక్కువగానే ఉన్నా ధరలు మాత్రం ఆకాశానికంటుతున్నాయి. దీని తరువాత నెదర్లాండ్స్, నార్వే, ఇజ్రాయెల్, డెన్మార్క్ లాంటి దేశాల్లో పెట్రోల్ రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక మనదేశంలో పెట్రోల్ రేట్లు పెరగడానికి కారణం లేకపోలేదు. కరోనా సమయంలో డిమాండ్, సప్లై మధ్య తేడాలు రావడం, చమురు నిల్వలు తగ్గిపోవడంతో చమురు సంస్థలు ఒక్కసారిగా రేట్లను పెంచేశాయి. దీంతో సామాన్యులకు జీవితం కష్టతరంగా మారింది. ఏదిఏమైనా వాహనం లేకపోతే బయటకి వెళ్లడం తప్పడం లేదు కాబట్టి ఎంత ధర పెరిగినా కొనుగోలు చేయడం తప్పడం లేదని సామాన్యులు వాపోతున్నారు.