మరో ఆసియా దేశం ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతోంది. ఇప్పటికే శ్రీలంక దారిలోనే దాయాది దేశం పాకిస్తాన్ పయణిస్తోంది. తాజాగా ఆ దేశంలో కరెంట్ ఇబ్బందులు తారాస్థాయికి చేరాయి. ఎంతలా విద్యుత్ ఆదా చేసేందుకు పెళ్లి వేడులకు కూడా కరెంట్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. తాజాగా పాక్ రాజధాని ఇస్లామాబాద్ లో రాత్రి 10 గంటల తర్వాత వివాహ వేడుకలను నిషేధించారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో విద్యుత్ సంక్షోభం భారీగా ఉంది. జూన్ 8 నుంచి ఈ నిషేధం అమలులోకి రానున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. లోడ్ షెడ్డింగ్ ను తగ్గించడానికి పాక్ ఈ నిర్ణయం తీసుకుంది.
దేశంలో ప్రస్తుతం విద్యుత్ సంక్షోభం దాని ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తోంది. ఇప్పటికే దేశంలో ఇంధన వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వ కార్యాలయాలకు శనివారం సెలవు పునరుద్ధరించాలని ఫెడరల్ క్యాబినెట్ బలవంతం చేస్తోంది. ప్రస్తుతం పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సూచనల మేరకే ఇస్లామాబాద్ లో విద్యుత్ కట్ నిర్ణయం అమలు అవుతుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే దేశరాజధానిలో జరిగే పెళ్లి వేడుకలకు ఒక వంటకాన్ని మాత్రమే అనుమతిస్తున్నట్లు అక్కడి జియో న్యూస్ తెలిపింది.
మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని.. షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. సరైన చర్యలు తీసుకోకుంటే పాక్ మరో శ్రీలంక అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర ఆయిల్, గ్యాస్ కొనుగోలు చేసేందుకు కూడా తగినంత డబ్బు లేదని ప్రధాని షరీఫ్ మంగళవారం చెప్పారు. కరాచీ, రావల్పిండి, ఇస్లామాబాద్ ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద పెద్ద ఎత్తున క్యూలు కనిపించడంతో ప్రజలు భయాందోళకు గురయ్యారు. ప్రస్తుతం పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు దారుణంగా తగ్గాయి. ప్రస్తుతం 6 బిలియన్ల ప్యాకేజీ కోసం పాక్, ఐఎంఎఫ్ వైపు ఆశగా చూస్తోంది.