Russian President is seriously ill: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత శనివారం తెల్లవారుజామున పుతిన్ తీవ్రంగా వాంతులతో బాధపడినట్లు రష్యన్ టెలిగ్రామ్ ఛానెల్ జనరల్ ఎస్వీఆర్ చెప్పింది. వెంటనే పుతిన్ అత్యవసర వైద్య బృందం హుటాహుటీన అధ్యక్ష కార్యాలయాని చేరుకుని చికిత్స అందించినట్లు వార్తలను వెల్లడించింది. రెండు వైద్య బృందాలు పుతిన్ కు చికిత్స అందించాయని తెలుస్తోంది. మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో పుతిన్ కు దాదాపుగా మూడు గంటల పాటు చికిత్స అందించారు. పుతిన్ పరిస్థితి బాగైన తర్వాతే వైద్య సిబ్బంది అక్కడి నుంచి వెళ్లినట్లుగా ఇండిపెండెంట్ నివేదించింది. జూలై 22 శుక్రవారం రాత్రి నుంచి జూలై 23 శనివారం వరకు పుతిన్ వైద్యుల సంరక్షణలో ఉన్నట్లు తెలిపింది.
Read Also: Home-Built Plane: కుటుంబం కోసం సొంతంగా విమానాన్నే నిర్మించిన కేరళ వ్యక్తి
గతంలో పుతిన్ అనారోగ్యం గురించి చాలా వార్తలు వచ్చాయి. అయితే వీటన్నింటిని క్రెమ్లిన్ వర్గాలు కొట్టిపారేశాయి. పుతిన్ టెర్మినల్ క్యాన్సర్, పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నల్లు పలు వార్తా ఏజెన్సీలు వార్తల్ని ప్రచురించాయి. అనేక సమావేశాల్లో రష్యన్ అధినేత కాళ్లు వణుకుతున్నట్లు, కంటి చూపు తగ్గిపోయినట్లు కథనాలు వచ్చాయి. ఉక్రయిన్ తో రష్యా యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యం గురించి ఏదో వార్త వస్తూనే ఉంది. అయితే పుతిన్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ అన్నారు. ఉక్రెయిన్ పై ఫిబ్రవరి 24న యుద్ధం మొదలుపెట్టింది రష్యా. దాదాపు యుద్ధం ఆరు నెలలకు చేరుకున్నా.. ఇదరు దేశాలు ఇప్పటికీ వెనక్కి తగ్గడం లేదు. యుద్ధం కారణంగా రష్యా పాశ్చాత్య దేశాల ఆంక్షలను ఎదుర్కొంటోంది.