Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం పోరు మొదలైంది. ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ జోరు పెరుగుతోంది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్, వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ లాంటి వారు అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు. ఇదిలా ఉంటే పోటీలో ప్రముఖంగా ఉన్న ఇండో అమెరికన్ వివేక్ రామస్వామి రష్యాకు బిగ్ ఆఫర్ ఇచ్చాడు.
చైనా విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవాలంటే రష్యాను, చైనా నుంచి దూరం చేయాలని అభిప్రాయపడ్డారు. తాను ఎన్నికైతే ఒప్పందం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకుంటానని రామస్వామి ఫాక్స్ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గురువారం అన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఉక్రెయిన్-రష్యాల మధ్య ప్రస్తుతం నియంత్రణ రేఖ ఉండేలా చేస్తానని, నాటోలోకి ఉక్రెయిన్ ను అనుమతించబోనని, రష్యాపై ఆంక్షలను ఎత్తేస్తానని, అయితే ఇవన్నీ జరగాలంటే రష్యా, చైనాతో సైనిక కూటమి నుంచి వైదొలగాల్సి ఉంటుందని వివేక్ రామస్వామి ఓ కండిషన్ విధించారు.
Read Also: Asaduddin Owaisi: సభలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు..మజ్లిస్ అభ్యర్థిపై కేసు నమోదు
తాను ప్రెసిడెంట్ అయితే పుతిన్ తో చేసుకునే ఒప్పందం అమెరికా ప్రయోజనాలను మెరుగుపరుస్తుందని అన్నారు. తద్వారా యూఎస్ఏ గెలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ఎలా ఆపుతారని ప్రశ్నించిన సమయంలో రామస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. 38 ఏళ్ల మల్టీ మిలియనీర్ బయోటెక్ వ్యవస్థాపకుడైన రామస్వామి రిపబ్లిక్ పార్టీ తరుపున ప్రెసిడెంట్ బరిలో ఉన్నారు. రష్యా-చైనా కూటమి అమెరికాకు అతిపెద్ద ముప్పని, అయితే 1972లో నిక్సన్ చేసినట్లే తాను చేస్తానని అన్నారు.
నార్డ్ స్ట్రీమ్ పై దాడి చేయడం ద్వారా, రష్యాపై ఆంక్షలు విధించడం ద్వారా అమెరికా, రష్యాని వెస్ట్రన్ దేశాల నుంచి దూరం చేసిందని అన్నారు. కాబట్టి మనం రష్యాతో ఆర్థిక సంబంధాలు తిరిగి తెరవగలిగితే, చైనా నుంచి రష్యాను దూరం చేయవచ్చని అన్నారు. ఇదిలా ఉంటే ఇరాన్ పై అమెరికా సైనిక బలగాన్ని ఉపయోగించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు రామస్వామి అన్నారు.
ఇదిలా ఉంటే రామస్వామి అభిప్రాయాలపై నిక్కీ హేలీ మండిపడ్డారు. ఇరాన్ లోని మతోన్మాద టెర్రరిస్టు పాలన ‘ డెత్ టూ అమెరికా’ అని పిలుస్తోందని, ఈ విషయంలో ఇజ్రాయిల్ కు అమెరికా మద్దతు ఉంటుందని, అమెరికాకు ఇజ్రాయిల్ స్నేహితుడని నిక్కీహేలీ అన్నారు. ఇజ్రాయిల్ ని పూర్తిస్థాయిలో రక్షించుకోవాలని, బలంగా ఉండేలా చూసుకోవాలని ఆమె అన్నారు.