Nancy Pelosi: చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో అడుగుపెట్టారు. తైవాన్ ఎయిర్‌పోర్ట్‌లో భారత కాలమానం ప్రకారం.. మంగళవారం రాత్రి దిగిన ఆమెకు ఘనస్వాగతం లభించింది. ఆ వెంటనే చైనాకు వ్యతిరేకంగా స్పందించారు. తైవాన్‌ను ఏకపక్షంగా కలిపేసుకోవాలన్న చైనా చర్యలను అమెరికా వ్యతిరేకిస్తుందన్నారు. అయితే దిగీదిగంగానే ఆమె చేసిన ట్వీట్లు చైనాను రెచ్చగొట్టేలా ఉన్నాయి. అమెరికా ముందు నుంచి చెప్తున్నట్లు తైవాన్ ప్రజాస్వామ్యానికి మద్దతుగా, అలాగే ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛకు మేం కట్టుబడి ఉంటామని ఆమె ట్వీట్లు చేశారు. మరోవైపు నాన్సీ పెలోసీ ల్యాండ్ అయిన విషయం తెలుసుకున్న చైనా.. జరగబోయే పరిణామాలన్నింటికి అమెరికానే కారణమంటూ ప్రకటించింది.
తన పర్యటన.. తైవాన్ ప్రజాస్వామ్యానికి మద్దతు విషయంలో అమెరికా నిబద్ధతను చాటుతోందని నాన్సీ పెలోసీ ట్వీట్ చేశారు. నిరంకుశత్వం, ప్రజాస్వామ్యాల మధ్య ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తోన్న ప్రస్తుత తరుణంలో.. తైవాన్‌లోని 23మిలియన్ల మంది ప్రజలకు అమెరికా సంఘీభావం ఇప్పుడు చాలా ముఖ్యమని అన్నారు. ‘తైవాన్ నాయకత్వంతో చర్చలు.. మా మద్దతును పునరుద్ఘాటిస్తాయి. స్వేచ్ఛాయుత ఇండో- పసిఫిక్ ప్రాంత అభివృద్ధి, ఉమ్మడి ప్రయోజనాల దిశగా సాగుతాయి’ అని పేర్కొన్నారు.
తైవాన్ అంశంలో ఇప్పటికే అమెరికా- చైనా దేశాల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. అగ్రరాజ్యం అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ ఆసియా పర్యటన నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదిరింది. తైవాన్‌లో అడుగుపెడితే అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని డ్రాగన్ హెచ్చరించిన నేపథ్యంలో నాన్సీ పెలోసీ తైపీ విమానాశ్రయంలో అడుగు పెట్టారు. నాన్సీ పెలోసీ తైపీలో పర్యటన విషయంలో వెనక్కి తగ్గేదే లే అంటూ అమెరికా తేల్చి చెప్పడంతో చైనా సైన్యం దూకుడుగా వ్యవహరిస్తోంది. చైనా యుద్ధ విమానాలు తైవాన్ జలసంధి దాటినట్లు స్థానికంగా వార్తలు వెలువడుతున్నాయి. పెలోసీ తైవాన్ పర్యటనపై చైనా మొదటి నుంచీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. చైనా హెచ్చరికలతో అప్రమత్తమైన అమెరికా.. నాన్సీ పెలోసీ పర్యటనకు ముందే అక్కడ నాలుగు యుద్ధ నౌకలను తైవాన్ సమీపంలోని సముద్ర జలాల్లో మోహరించినట్టు తెలుస్తోంది.
Russia on Pelosi Taiwan Visit : “పూర్తిగా రెచ్చగొట్టే చర్య”.. చైనాకు వంతపాడుతున్న రష్యా!
తైవాన్-చైనా ఉద్రిక్తతల నడుమ యుద్ధ వాతావరణం నెలకొనడంతో మూడో ప్రపంచ యుద్ధం అంటూ ట్విట్టర్ ట్రెండ్ నడుస్తోంది. స్వీయ పరిపాలన ఉన్న తైవాన్‌ను తమ సొంతంగా ప్రకటించుకుంది చైనా. అలాగే.. పెలోసీ తైవాన్ పర్యటన.. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని, చైనా ఆర్మీ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించింది. పౌర యుద్ధంలో కమ్యూనిస్టులు విజయం సాధించిన తర్వాత 1949లో తైవాన్, చైనా విడిపోయాయి. చైనా ప్రభుత్వాన్ని గుర్తించినా.. తైవాన్‌తో రక్షణ సంబంధాలను కొనసాగిస్తుంది. కానీ, తైవాన్‌తో అమెరికా ప్రత్యక్ష సంబంధాలను చైనా వ్యతిరేకిస్తోంది. తైవాన్‌లో నాన్సీ పెలోసీ పర్యటిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో జరిగిన ఫోన్ చర్చల్లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హెచ్చరించారు.