ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా దళాలు పెద్ద సంఖ్యలో సైన్యాన్ని మోహరించింది. లైవ్ వార్ డ్రిల్స్‌ను చేస్తున్నది. అమెరికా సైతం ఇప్పటికే 1700 మంది సైన్యాన్ని పోలెండ్‌కు పంపింది. జర్మనీలో ఉన్న మరో వెయ్యిమంది సైన్యం పోలెండ్‌కు పయనయ్యారు. దీంతో పాటు, మరో 3 వేల మంది సైన్యాన్ని పోలెండ్ పంపేందుకు అమెరికా సన్నాహాలు చేస్తున్నది. అయితే, అనుకోని విధంగా ఏదైనా యుద్ధం సంభవిస్తే రష్యాతో నేరుగా తలపడకుండా నాటో దళాలకు సహకరించాలన్నది అమెరికా ఆలోచన. అమెరికా కనుక నేరుగా రష్యాతో యుద్ధానికి దిగితే దాని వలన ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఆ దేశానికి తెలుసు.
Read: IPL Mega Auction: ఐపీఎల్ వేలంలో అపశ్రుతి.. ఆగిపోయిన వేలం
అందుకే నేరుగా రష్యాతో తలపడకూడదని నిర్ణయించింది. అంతేకాదు, అమెరికా పౌరులను వెంటనే వెనక్కి వచ్చేయాలని ఇప్పటికే యూఎస్ ఆదేశాలు జారీ చేసింది. అమెరికా బాటలోనే న్యూజిలాండ్ కూడా పయనించింది. ఉక్రెయిన్‌లో ఉన్న తమ పౌరులు వెంటనే వెనక్కి వచ్చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అమెరికా, నాటో దళాలపై నమ్మకంలేని ఉక్రెయిన్ వారి సైన్యానికి ప్రస్తుతం శిక్షణ ఇస్తున్నది. ఏదైనా అనుకోని విధంగా విపత్తు సంభవిస్తే రష్యాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఉక్రెయిన్ పిలుపునిచ్చింది.