ఐక్యరాజ్యసమితి వద్దన్నా ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తోంది రష్యా. ఈ నేపథ్యంలో రష్యాపై చర్యలకు దిగింది ఐక్యరాజ్యసమితి. రష్యాకు గురువారం మరో గట్టి షాక్ తగిలింది. ఐక్యరాజ్య సమితికి చెందిన మానవ హక్కుల మండలి (హ్యూమన్ రైట్స్ కౌన్సిల్) నుంచి రష్యాను బహిష్కరించారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధుల సభలో ఓటింగ్ జరిగింది. జనరల్ అసెంబ్లీలో నిర్వహించిన ఓటింగ్ లో సభ్య దేశాల ఓటింగ్ మెజారిటీకి అనుగుణంగా రష్యాను మానవ హక్కుల మండలి నుంచి బయటకు పంపారు.
ఈ ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉండిపోవడం గమనార్హం. ఓటింగ్‌లో పాల్గొనకుండా భారత్ తన తటస్థ వైఖరిని రష్యాకు వెల్లడించింది. మానవ హక్కుల మండలి నుంచి బహిష్కరించాలన్న తీర్మానంపై యుఎన్ జనరల్ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 93 దేశాలు ఓటేశాయి.
ఈ తీర్మానానికి వ్యతిరేకంగా 24 దేశాలు ఓటేయగా… భారత్ సహా 58 దేశాలు ఈ ఓటింగ్‌లో పాలుపంచుకోలేదు. మరోవైపు బ్రిటన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్ కు సరైన ఆయుధాలు అందిస్తే రష్యా సేనల అంతుచూస్తుందని పేర్కొంది. ఈ క్రమంలో బ్రిటన్ ఇప్పటికే ఉక్రెయిన్ కు అనేక సాయుధ వాహనాలు పంపించింది. అయినప్పటికీ తమకు ఆయుధాల కొరత ఉందని, తగినన్ని ఆయుధ వ్యవస్థలు అందకపోతే డాన్ బాస్ ను రష్యా ఆక్రమించడం ఖాయమని జెలెన్ స్కీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెక్ రిపబ్లిక్ దేశం ఉక్రెయిన్ కు యుద్ధ ట్యాంకులు పంపింది. మరికొన్ని దేశాలు ఉక్రెయిన్ కు సాయం చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.