దక్షిణాఫ్రికాలో దారుణం చోటు చేసుకుంది. ఓ నైట్ క్లబ్ లో దాదాపుగా 20 మంది యంగ్ ఏజ్ యువకులు చనిపోయి పడి ఉన్నారు. ఈ వార్త దక్షిణాఫ్రికాలో సంచలన కలిగించింది. దక్షిణాఫ్రికాలోని దక్షిణ ప్రాంతంలోని ఈస్ట్ లండన్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నైట్ క్లబ్ లో పార్టీ చేసుకుంటున్న సందర్భంలో యువకులు మరణించినట్లు తెలుస్తోంది. చనిపోయినవారి అందరి వయసు 18-20 మధ్యే ఉందని అక్కడి పోలీస్ అధికారులు వెల్లడించారు. ఈస్టర్న్ కేప్ అథారిటీ ప్రతినిధి బ్రిగేడియర్ ధెంబింకోసి కినానా మాట్లాడుతూ.. ఈ సంఘటన జరగడానికి ముందు ఎన్యోబెని టావెర్న్ క్లబ్ లో ఎంత మంది ఉన్నారో తెలియదని..ఎవరైనా ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా పోలీసులకు తెలియదని అన్నారు.
ప్రస్తుతం ఘటన స్థలంలో పరిస్థితులను పరిశీలిస్తున్నారు పోలీసులు. ఘటన జరిగిన సీనరీ పార్క్ , సిటీ సెంటర్ నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. పోలీసులకు సమాచారం అందే సరికి క్లబ్ లోని ఫ్లోర్ పై మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మృతదేహాలపై ఎలాంటి గాయాలకు సంబంధించిన ఆనవాళ్లు కూడా లేవని పోలీసులు వెల్లడించారు. హైస్కూల్ ఎగ్జామ్స్ ముగిసిన తర్వాత ‘పెన్స్ డౌన్’ పార్టీ చేసుకునేందుకు యవకులంతా పార్టీకి వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే మరణాలకు సంబంధించిన కారణాలను పోలీసులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అసలు మరణాలకు కారణం ఏమిటనే ఆలోచనలోనే ఉన్నారు. ఇంత మంది ఒకే చోట ఎలా మరణించారనేది అంతుచిక్కడం లేదు. అటాప్సీ రిపోర్ట్ వస్తే కానీ మరణాలకు సంబంధించి స్పష్టమైన కారణాలు తెలియవని పోలీస్ అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలంలో ఖాళీ మద్యం సీసాలు, విగ్గులు పడి ఉన్నట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు. మరణాలకు తొక్కిసలాట కారణం అని ఊహాగానాలు వెలువడినప్పటీకీ వాటిని పోలీసులు తోసి పుచ్చారు. తొక్కిసలాటకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేవని చెబుతున్నారు. అయితే విష ప్రయోగం జరగవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.