Israel Iran War: ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. శుక్రవారం, ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయిల్ ఇరాన్ వ్యాప్తంగా భారీ దాడులు నిర్వహించింది. ముఖ్యంగా, ఇరాన్ అణు కార్యక్రమాలు జరిగే చోట్లతో పాటు ఇరాన్ టాప్ మిలిటరీ జనరల్స్‌ని, అణు శాస్త్రవేత్తల్ని హతమార్చింది. దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయిల్ పైన ఇరాన్ వందలాది మిస్సైళ్లను ప్రయోగించింది.
Read Also: Himanta Biswa Sarma: కాంగ్రెస్ ‘‘చారిత్రక తప్పిదం’’ వల్లే పాకిస్తాన్ అణ్వాయుధ దేశంగా మారింది..
ఇదిలా ఉంటే, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హత్య చేయాలని ఇజ్రాయిల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇజ్రాయిల్ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘‘వీటో’’ చేసినట్లు రాయిటర్స్ నివేదించింది. ఇజ్రాయిల్ ప్రణాళికకు ట్రంప్ ఒప్పుకోలేదని వార్తాసంస్థ రాయిటర్స్ చెప్పింది. ఇజ్రాయిల్ ప్రణాళికపై ‘‘ఇరానియన్లు ఒక్క అమెరికన్‌ను చంపలేదు కదా..? వారు చేసేవరకు, మేము రాజకీయ నాయకత్వాన్ని టార్గెట్ చేయడం గురించి మాట్లాడం’’ అని ట్రంప్ అన్నట్లు చెప్పింది.
ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ.. శుక్రవారం ఇరాన్‌పై ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల వల్ల ఆ దేశంలో పాలనా మార్పు సంభవించవచ్చని అన్నారు. దాడులు ప్రారంభించడానికి ముందే ట్రంప్‌కి చెప్పినట్లు నెతన్యాహూ ధ్రువీకరించారు. తాజాగా, ట్రంప్ మాట్లాడుతూ.. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య శాంతి నెలకొనాలని ఆశించారు.