US presidential race: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. 2024లో యూఎస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి, ఈ నేపథ్యంలో అక్కడి ప్రెసిడెంట్ రేసు మొదలైంది. రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల్లో అధ్యక్ష బరిలో నిలిచేందుకు పలువురు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష రిపబ్లిక్ పార్టీలో ఈ పోటీ ఎక్కువగా ఉంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు ఇండో అమెరికన్లు వివేక్ రామస్వామి, నిక్కీ హెలీ లాంటి వారు పోటీలో ఉన్నారు.
ఇదిలా ఉంటే అధ్యక్ష ఎన్నికల రేసులో డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. తాజాగా ఏబీసీ న్యూస్/వాషింగ్టన్ పోస్టు నిర్వహించిన సర్వేలో జో బిడెన్ అప్రూవల్ రేటింగ్ 19 పాయింట్లు తగ్గినట్లు సర్వేలో తేలింది. అధ్యక్షుడు బైడెన్ తో పోలిస్తే ట్రంప్ అప్రూవల్ రేటింగ్ 10 పాయింట్లు ఎక్కువగా ఉన్నట్లు తేల్చింది. జోబైడెన్ అధికారంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ క్షీణించిందని 44 శాతం అమెరికన్లు పేర్కొన్నారు. ఆర్థిక రంగంలో బైడెన్ పనితీరును 30 శాతం మంది మాత్రమే ఆమోదించారు.
Read Also: Afghanistan: ప్రపంచంలో “అత్యుత్తమ కరెన్సీ పనితీరు”లో ఆఫ్ఘనిస్తాన్ టాప్.
ఇక యూఎస్-మెక్సికో సరిహద్దు ఇమ్మిగ్రేషన్ నిర్వహించే అంశంపై బైడెన్ అప్రూవల్ 23 శాతానికి తగ్గింది. ఈ సర్వేలో మొత్తంగా బైడెన్ పనితీరును 37 శాతం ఆమోదించగా.. 56 శాతం మంది తిరస్కరించారు. ఇదే కాకుండా ఆయన వయసుపై కూడా అమెరికన్లు ప్రశ్నలను లేవనెత్తారు. జోబైడెన్ అమెరికా అధ్యక్ష పదవిలో రెండోసారి కొనసాగడానికి ఆయన వయసు అడ్డంకిగా నిలుస్తుందని 74 శాతం సర్వేలో తెలిపారు.
ఈ సర్వేలో డొనాల్డ్ ట్రంప్ అప్రూవల్ రేటింగ్ పెరిగింది. యూఎస్ పౌరుల్లో 48 శాతం అతనిని ఆమోదించారు. అయితే అమెరికా అధ్యక్షుడిగా ఆయన పనితీరును ఇప్పటికీ 49 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు. అయితే ట్రంప్ ఆరోపణలు చేస్తున్నట్లుగా 2020 ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని చెప్పడాన్ని చాలా మంది అమెరికన్లు తిరస్కరిస్తున్నారు. 60 శాతం మంది అమెరికన్లు బైడెన్ చట్టబద్ధంగా గెలిచారని చెప్పగా, 29 శాతం మంది చట్టబద్ధంగా గెలవలేదని అభిప్రాయపడ్డారు.
62 శాతం అమెరికన్లు డెమెక్రాట్లు బైడెన్ కి బదులుగా మరొకరిని అధ్యక్ష పదవి కోసం ఎన్నుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే రిపబ్లికన్ పార్టీలో అధ్యక్ష రేసులో 54 శాతం మంది మద్దతు ఇచ్చారు.
నవంబర్ 2024లో జరిగే పోటీలో ట్రంప్ కు 51 శాతం మద్దతు ఉంటుందని, బైడెన్ కి 42 శాతం మద్దతు ఉంటుందని ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వే వెల్లడించింది. మేలో జరిగిన సర్వేలో 49-42 శాతం ఉందని తెలిపింది. అయినప్పటికీ ట్రంప్ 50 శాతానికి దగ్గరగా ఉన్నాడని సర్వే తెలిపింది.