Pakistan: పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుగ్రహం కోసం తాపత్రయపడుతున్నారు. ఆరేళ్ల తర్వాత, తొలిసారిగా పాకిస్తాన్‌తో అమెరికా ద్వైపాక్షిక చర్చలు నిర్వహించింది. రెండు దేశాల సంబంధాలు బలపడుతున్నాయి. అయితే వీటన్నింటికి ఒకే కారణం కనిపిస్తోంది. పాకిస్తాన్‌లోని అరుదైన ఖనిజాలపై అమెరికా కన్నేసింది. అమెరికా ఆశలకు అనుగుణంగా పాకిస్తాన్ కూడా పనిచేస్తోంది.
ముఖ్యంగా, రేర్-ఎర్త్ ఖనిజాలపై అమెరికా దృష్టి సారించిన నేపథ్యంలో, ఇటీవల వైట్ హౌజ్‌లో జరిగిన సమావేశంలో ఆసిమ్ మునీర్, డొనాల్డ్ ట్రంప్‌కు ఒక సూట్ కేస్‌లో ఉన్న రేర్ ఎర్త్ ఖనిజాలను చూపిస్తున్న ఫోటో వైరల్‌గా మారింది. ఈ సమయంలో పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ అక్కడే ఉన్నాడు. ఓవర్ కార్యాలయంలో క్లోజ్డ్ డోర్ సమావేశం తర్వాత, యూఎస్ మెటల్స్ కంపెనీలు పాకిస్తాన్‌తో $500 మిలియన్ల పెట్టుబడి ఒప్పందంపై సంతకం చేసిన వారాల తర్వాత ఈ ఫోటో బయటకు వచ్చింది. నిజానికి, వాణిజ్య పరంగా నిరూపించబడిన అరుదైన ఖనిజాలు లేనప్పటికీ, పాకిస్తాన్ ప్రస్తుతానికి రంగురాళ్లలో ట్రంప్‌ను అబ్బురపరిచిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Read Also: India UNSC Veto Power: UNSCలో భారత్‌కు వీటో పవర్ దూరం చేస్తుంది ఏంటి? ఇండియా కల నెరవేరుతుందా!
మరోవైపు, ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవడానికి పాకిస్తాన్ పడరాని పాట్లు పడుతోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో కాల్పుల విరమణకు ట్రంప్ సహకరించారని, శాంతికి సహకరించినందకు ఆయనకు నోబెల్ శాంతి బహుమతిని ప్రధానం చేయాలని షరీఫ్ కోరారు. పాకిస్తాన్ వ్యవసాయం, ఐటీ, గనులు ఖనిజాలు, ఇంధన రంగాల్లో అమెరికన్ కంపెనీలు పెట్టుబడుల్ని పెట్టాలని కోరుతోంది.
పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రాంతంలో ఈ ఖనిజాలు ఉన్నాయి. అయితే, కల్లోలిత ప్రాంతంలో పాకిస్తాన్ ప్రభుత్వ పట్టు లేదు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆధీనంలో మెజారిటీ బలూచిస్తాన్ ప్రాంతం ఉంది. అయితే, పాకిస్తాన్ ఆలోచన ప్రకారం, అమెరికన్ కంపెనీలు ఈ ప్రాంతంలో అడుగుపెడితే ఇటు వేర్పాటువాదుల్ని అణచడంతో పాటు, పాకిస్తాన్‌కు డాలర్లు వచ్చి అప్పులు తీరిపోతాయని భావిస్తోంది.