ఆఫ్గాన్‌లో పరిస్థితి చేయిజారిపోయింది. ఒక్కో నగరం తాలిబన్ల చెరలో చేరిపోతోంది. ఇప్పటికే 34 ప్రొవిన్షియల్ రాజధానుల్లో 10.. తాలిబన్ల వశమయ్యాయి. ఆ దేశంలోని 65 శాతం భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా లోగర్ ప్రావిన్స్ ప్రాంతాన్ని కూడా ఆధీనంలోకి తీసుకున్నారు. కందహార్, హెరత్ నగరాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన గంటల్లోనే లోగర్ ప్రాంతాన్ని ఆక్రమించినట్లు ప్రకటించారు. తాలిబన్లు చేజిక్కించుకున్న లోగర్ ప్రావిన్స్… ఆ దేశ రాజధాని కాబూల్‌కి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమెరికా, నాటో సేనలు ఈ నెలాఖరులోగా పూర్తిగా వైదొలగనుండడంతో… ఆఫ్గాన్ క్రమంగా తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. మిలిటరీ బలగాలు సైతం తాలిబన్లకు లొంగిపోతున్నాయి. మూడు నెలల్లో కాబూల్ కోటపై తాలిబన్ల తీవ్రవాద జెండా ఎగరనుందని… అమెరికా గూఢచారి విభాగం వేసిన అంచనా… ఆందోళన రేపుతోంది.
తానిబన్ల దాడుల్లో నెల రోజుల్లో వెయ్యి మందికిపైగా పౌరులు బలయ్యారు. 4 వేల మందికి పైగా గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో… అక్కడి ప్రభుత్వం రాయబారానికి దిగింది. తాలిబన్లతో అధికారం పంచుకొనేందుకు సిద్ధపడింది. ఆ మేరకు మధ్యవర్తిత్వం చేస్తున్న ఖతార్ ముందు ప్రతిపాదన చేసింది. కాబూల్ తాలిబన్ల ఏలుబడిలోకి వచ్చేస్తే… దాని పర్యవసానం భారత్‌తోపాటు అమెరికా, ఐరోపా, ఉత్తర ఆఫ్రికాలపై పడుతుంది. ఆఫ్గాన్‌లోని అస్థిరత ఇరాన్, మధ్య ఆసియా, కాశ్మీర్‌లకూ విస్తరించవచ్చు. అందుకే అంతర్జాతీయ సమాజం అంతా కలసి, తక్షణమే ఆఫ్గాన్‌లో శాంతిస్థాపనకు అవకాశం వెతకాలి. అధికార పంపిణీ ప్రతిపాదనతో… ఆ దిశగా తొలి అడుగు పడింది. కానీ దీనికి తాలిబన్లు ఎంత మేర ఒప్పుకుంటారో, ఒప్పుకున్నా.. ఆ మాటకు ఏ మేరకు కట్టుబడి ఉంటారో చూడాలి.