శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజపక్సే తిరుమల శ్రీవారి సేవలో తరించారు. భార్య షిరాంతి రాజపక్సేతో కలిసి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం ఆలయానికి చేరుకున్న శ్రీలంక ప్రధానికి టీటీడీ జెఈఓ వీరబ్రహ్మం, సివిఎస్వో గోపినాథ్ జెట్టి మహద్వారం వద్ద సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
అనంతరం శ్రీవారిని దర్శించుకున్న ప్రధాన మంత్రి మహింద రాజపక్సే కు ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనంతోపాటు తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందించారు. ఏటా తిరుమలకు వచ్చిన స్వామివారిని దర్శించుకోవడం రాజపక్సేకు అలవాటు. కరోనా కారణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆయన శ్రీలంక నుంచి గురువారమే తిరుమల వచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు, ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ బాబు, రిసెప్షన్ డిప్యూటీ ఈఓ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.