ద్వీపదేశం శ్రీలంక తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిత్యావసరాల ధరలు చుక్కలను అంటుతున్నాయి. గ్యాస్, పెట్రోల్ దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితులు మధ్య ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో రోడ్డెక్కి తమ ఆందోళన, నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు. ఏకంగా అధ్యక్షుడు రాజపక్సే నివాసానికి దగ్గర్లో పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేస్తున్నారు. అధ్యక్షుడు గోటబయ రాజపక్సేతో పాటు ప్రధాని మహిందా రాజపక్సే రాజీనామాలను డిమాండ్ చేస్తున్నారు శ్రీలంక ప్రజలు.
తాజాగా ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో ప్రధాని మహిందా రాజపక్సే తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. గత రెండు రోజుల నుంచి ప్రధాని తన పదవికి రాజీనామా చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు తన పదవికి రాజీనామా చేశారని శ్రీలంక లోకల్ మీడియా వెల్లడించింది. రాజపక్సే కుటుంబం వల్లే శ్రీలంకలో ఈ ఆర్థిక సమస్యలు ఏర్పడుతున్నాయని అక్కడి ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే సమస్య పరిష్కారానికి అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు గోటబయ రాజపక్సే ప్రతిపక్షాలను ఆహ్వానించినా… ప్రతిపక్షాలు స్పందించలేదు.