ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసిన పొడవైన క్యూలే దర్శనమిస్తున్నాయి. రోజుల తరబడి ప్రజలు చూస్తున్నా.. నిత్యావసరాలు దొరకడం లేదు. ముఖ్యంగా పెట్రోల్, గ్యాస్, డిజిల్ స్టేషన్ల వల్ల పెద్ద ఎత్తున వాహనాలు, ప్రజలు దర్శనమిస్తున్నారు. ఇలాంటి సంక్షోభం మధ్య ఉండలేమనుకున్న ప్రజలు వేరే దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో దేశం నుంచి విదేశాలకు వెళ్లి ఉపాధి పొందేందుకు పాస్‌పోర్ట్ కోసం ప్రజలు దరఖాస్తు చేస్తుకుంటున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజులుగా క్యూలో నిల్చున్న గర్బిణి ప్రసవవేదనతో బాధపడుతూ కూడా పాస్‌పోర్ట్ కోసం ప్రయత్నించింది. కొలంబోలోని ఇమ్మిగ్రేషన్ విభాగం వద్ద ప్రసవ వేదనతో బాధపడుతున్న 26 ఏళ్ల మహిళను క్యాజిల్ ఆస్పత్రికి ఆర్మీ సిబ్బంది తరలించింది. అక్కడ ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. దేశం వదిలి ఇతర దేశాలకు వెళ్లేందుకు మహిళతో పాటు ఆమె భర్త గత రెండు రోజుల నుంచి పాస్‌పోర్ట్ కోసం క్యూలో నిలబడుతున్నారు.
Read Also: Viral Video News: గుర్రం మీద స్విగ్గీ డెలివరీ బాయ్….వీడియోకి జనం ఫిదా
ఇదిలా ఉంటే ఇంధనం కోసం పెట్రోల్ బంకు వద్ద క్యూలో నిలుచున్న వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. త్రీవీలర్ పై ఐస్ క్రీం విక్రయించే 60 ఏళ్ల వ్యక్తికి గుండె నొప్పి రావడంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మరణించాడు. శ్రీలంకలో ఇండియన్ ఆయిల్ కంపెనీ ఎల్ఐఓసీ రిటైల్ పంపుల వద్ద భారీగా జనాలు క్యూలో నిలుచుంటున్నారు. 1948లో బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందిన శ్రీలంక ఇంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎప్పుడూ చూడలేదు. ప్రస్తుతం విదేశీ మారక నిల్వల కొరతను అధిగమించేందుకు శ్రీలంక కనీసం 4 బిలియన్ డాలర్ల సహాయాన్ని పొందాల్సి ఉంటుంది. శ్రీలంకలో విదేశీ రుణాలు 51 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. కనీసం ఇంధనాన్ని దిగుమతి చేసుకునేందుకు విదేశీ మారక నిల్వలు లేకపోవడంతో శ్రీలంకలో ఇంధన సమస్య ఏర్పడుతోంది.