ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ బాయ్‌లు నూటికి 99 పాయింట్ 99 శాతం బైక్‌ల మీదే వచ్చి పార్సిళ్లు అందించి వెళుతుంటారు. జొమాటో, స్విగ్గీ, ఉబర్.. కంపెనీ ఏదైనా కామన్‌గా డెలివరీ బాయ్‌లు పనిచేసే విధానమిది. కానీ.. వీపుకి స్విగ్గీ బ్యాగ్‌ను తగిలించుకున్న ఓ డెలివరీ బాయ్ ఏకంగా తెల్లగుర్రం ఎక్కి వెళుతున్న వీడియో విపరీతంగా ఆకట్టుకుంటోంది. సామాజిక మాధ్యమాలను అసాధారణంగా దున్నేస్తోంది. ఈ వీడియోని దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఇది ‘వైరల్’ అనే వర్డ్‌కి పర్యాయ పదంగా నిలిచింది. దీన్ని చూసి చివరికి స్విగ్గీ మేనేజ్‌మెంట్ కూడా అమితాశ్చర్యం వ్యక్తం చేసింది.
ఆ అపరిచితుడెవరో దయచేసి కనిపెట్టండి బాబూ అంటూ నెటిజన్లను, ఫూడీస్‌ని రిక్వెస్ట్ చేసింది. ఆ హీరో ఆచూకీ చెబితే 5 వేల ‘స్విగ్గీ మనీ’ అవార్డ్ కూడా ఇస్తామని ప్రకటించింది. “గుర్రం విగ్రహం మీద కూర్చొని తీయించుకున్న వీడియో కాదిది. నిజంగా గుర్రం మీదే దర్జాగా వెళుతున్న ఆ వ్యక్తి చేసిన ఈ పని అనూహ్యమైంది. అభినందించకుండా ఉండలేనిది. మా స్విగ్గీ మోనోగ్రామ్డ్ డెలివరీ బ్యాగ్ ధరించటం ద్వారా ఈ యాక్సిడెంటల్ బ్రాండ్ అంబాసిడర్ మాకు అద్భుతమైన ప్రచారం కూడా చేసిపెట్టాడు. అతనికి హార్ట్‌ఫుల్ థ్యాంక్స్ చెప్పాలి” అని ఆనందం వ్యక్తం చేసింది.
అదే సమయంలో ఆ వ్యక్తితోపాటు ఓ ఐదు ప్రశ్నలకు సమాధానమూ తెలిస్తే బాగుండని ఆశిస్తోంది. ఆ ప్రశ్నలు.. 1. ఇంతకీ ఈ యంగ్ స్టార్ ఎవరు? 2. ఇతను అసలు రోజూ ఏ వాహనం నడుపుతుంటాడు? 3. అతను వీపుకి తగిలించుకున్న ఆ బ్యాగులో వాస్తవానికి ఏముంది? 4. ముంబైలో భారీ వర్షం కురుస్తున్న రోజు అతను ఎందుకిలా రోడ్డు మీదికి వచ్చాడు? 5. ఈ ఆర్డర్‌ని కస్టమర్‌కి ఇవ్వటానికి వెళ్లినప్పుడు అతను ఆ గుర్రాన్ని ఎక్కడ పార్కింగ్ చేశాడు?. చివరగా సరదాగా ఒక క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది. “ఫుడ్ డెలివరీ వ్యవస్థను మేం మరింత పర్యావరణహితంగా మార్చాలనుకుంటే వేరే పద్ధతులు పాటిస్తాం గానీ మోటర్ వాహనాల స్థానంలో జంతువులను మాత్రం ప్రవేశపెట్టబోం” అని చమత్కరించింది.
Teddy Bear and Micky Mouse:ఏదో చేద్దామనుకున్నాడు.. అరెస్టయ్యాడు