Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం ప్రారంభమై ఇప్పటికీ 20 రోజులు గడిచాయి. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ లోకి చొరబడి అక్కడి ప్రజలను ఊచకోత కోశారు. ఈ దాడిలో 1400 మంది మరణించారు. దాదాపుగా 200 మంది కన్నా ఎక్కువ మందిని బందీలుగా తీసుకుని గాజాలోకి వెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 7000 మందికి పైగా పాలస్తీనా ప్రజలు మరణించారు.
అయితే ఇజ్రాయిల్ సైన్యం భూతల దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ గాజాలో భూమి కింద హమాస్ సొరంగాల నెట్వర్క్ ఇజ్రాయిల్ బలగాలకు ప్రతికూలంగా మారాయి. 80 మీటర్ల లోతులో వందల కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ టన్నెల్ వ్యవస్థలోనే హమాస్ ఉగ్రవాదులు ఉంటున్నారు. ఈ వ్యవస్థనే ప్రధానంగా వారికి బలంగా మారింది. ప్రస్తుతం కిడ్నాప్ చేసిన ఇజ్రాయిలీలను కూడా టన్నెళ్లలోనే దాచారు. గాజా నగరం కింద భూమిలో ఓ నగరాన్ని సృష్టించారు హమాస్ ఉగ్రవాదులు.
Read Also: MK Stalin: గవర్నర్‌ని మార్చొద్దు, మాకు ఉపయోగపడుతున్నాడు.. ప్రధానిపై స్టాలిన్ విమర్శలు.
ఇజ్రాయిల్ కొత్త ఆయుధం ‘‘స్పాంజ్ బాంబులు’’:
సొరంగాల నెట్వర్క్ లో హమాస్ తో పోరాడేందుకు ఇజ్రాయిల్ సరికొత్త ఆయుధాన్ని బయటకు తీస్తోంది. ‘‘స్పాంజ్ బాంబులు’’లను ఇజ్రాయిల్ తయారు చేస్తోందనే నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఫోమ్ రూపంలో ఆకస్మికంగా పేలే స్పాంజు బాంబులు, అతి వేగంగా విస్తరిస్తుంది. ఆ తరువాత గట్టిపడుతుంది. ఇజ్రాయిల్ రసాయన గ్రెనెడ్స్ ని పరీక్షిస్తోందని ది టెలిగ్రాఫ్ ఒక నివేదికలో తెలిపింది. అయితే దీంట్లో పేలుడు పదార్థాలు లేవు. హమాస్ మిలిటెంట్లకు ఎంట్రీలుగా ఉన్న ఖాళీలు, సొరంగాల ద్వారాలను మూసేసేందుకు ఇది ఉపయోగిస్తారు.
ఈ పరికరాల్లోని విభిన్న ద్రవాలను లోహ అవరోధం ద్వారా వేరుచేయబడి, ఓ ప్లాస్టిక్ కంటైనర్ లో ఉంచుతారు. దీన్ని ఆక్టివేట్ చేసినప్పుడు ఈ ద్రవాలు కలిసిపోయి, గమ్యస్థానం వైపు ముందుకు సాగుతాయి. ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) 2021లో గాజా సరిహద్దులోని మాక్ టన్నెల్ సిస్టమ్ ఎక్సర్‌సైజులో ఈ పరికరాన్ని ఉపయోగించారు.
భూగర్బంలోకి వెళ్లేందుకు ఇజ్రాయల్ ఎలైట్ గ్రూప్స్ సిద్ధమయ్యాయి. ఈ గ్రూపులోని కమాండోలు సొరంగాలను కనుగొనడంతో పాటు క్లియర్ చేయడం, నాశనం చేయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు.
సొరంగాలే బలం:
హమాస్ ఉగ్రవాదులకు సొరంగాలే బలంగా ఉన్నాయి. ఇజ్రాయిల్ పై దాడి చేసిన పలు సందర్భాల్లో మిలిటెంట్లు సొరంగాలకు వెళ్లిపోతున్నారు. దీంతో ఇజ్రాయిల్ దాడులు చేసినా కూడా సాధారణ ప్రజలే ఎక్కువగా మరణిస్తున్నారు. వెస్ట్ బ్యాంకుతో పోలిస్తే గాజా స్ట్రిప్ లో హమాస్ బలంగా ఉండటానికి సొరంగాలే కారణం. 1987లో హమాస్ ఏర్పడితే.. 1990 నుంచి సొరంగాలను తవ్వడం ప్రారంభించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.