ఓ వైపు అమెరికా తరలింపు ప్రక్రియ తుది దశకు చేరింది. 31 తరువాత అమెరికా లేని ఆఫ్గానిస్తాన్‌ని ప్రపంచం చూస్తుంది. కానీ ఆఫ్గన్ ప్రజలకు మాత్రం మళ్లీ నరకం మొదలవుతుంది. మళ్లీ అంతర్యుద్ధంతో అట్టుడుకుతుంది. ఉగ్రతండాలు ఊళ్లకు ఊళ్లను కభళిస్తాయి. అందుకే ఇప్పుడే ఎలాగైనా బయటపడాలనుకుంటున్నారు ఆఫ్ఘన్ ప్రజలు. అందుకోసం దారులు వెతుకుతున్నారు. చావటానికైనా సిద్ధమే కానీ నరకూపం లాంటి చోట ఉండలేమని సరిహద్దులు దాటే ప్రయత్నం చేస్తున్నారు.
నరకకూపం లాంటి ఆఫ్గనిస్తాన్‌లో ఉండటానికి అక్కడి ప్రజలు ఇష్ట పడటం లేదు. ఎలాగైనా దేశ సరిహద్దులు దాటాలని ప్రయత్నిస్తున్నారు. విమానంలో వెళ్లటానికి అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో బార్డర్ల వైపు చూస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్‌తో ఉన్న సరిహద్దులకు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నట్టు సమాచారం.
ఇప్పుడు ఆఫ్గనిస్తాన్ తీవ్ర సంక్షోభంలో ఉంది. ప్రజలు భయంతో అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. శరణార్థులుగా మారుతున్నారు. వలస వస్తున్న శరణార్థుల కోసం అమెరికా తన మిలటరీ బేస్‌లలో ఆశ్రయం కల్పిస్తోంది. మిడిల్ ఈస్ట్, యూరప్‌లోని పలు ఏర్ బేస్‌లలో వీరికి ఆశ్రయం కల్పిస్తోంది. అఫ్గాన్ స్పెషల్ వీసా ఉన్న వారితో పాటు వారి కుటుంబ సభ్యులు, అలాగే ఇక్కడ రిస్క్‌లో ఉన్న వారిని దేశం నుంచి తరలిస్తున్నారు. వివిధ దేశాలలో అమెరికాకు ఉన్న సైనిక స్థావరాలలో కలిసి 70 వేల మందికి ఆశ్రయం కల్పించవచ్చు. పొరుగు దేశాలు అఫ్గానిస్తాన్ పౌరులను రానీయకపోవడంతో వీరంతా అమెరికా ఆశ్రయం కోసం ఎదురు చూస్తూ విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నారు.
రేపటి ఆఫ్గనిస్తాన్ ఎలావుంటుందో తాజా ఘటనలు చెప్పకనే చెబుతున్నాయి. ఉగ్రగ్రూపుల యుద్ధ భూమిగా మారుతుంది…ప్రజల మాన ప్రాణాలకు రక్షణ కరువు.. సగటు ఆఫ్గనీ పౌరుడి ఆందోళన ఇది. దాదాపు ఐదు లక్షల మంది పౌరులు దేశం విడిచి వెళ్లిపోయే అవకాశం ఉంది. ఐక్యరాజ్య సమితి శరణార్థ విభాగం (UNHCR) ఈ అంచనా వేసింది. అఫ్గాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత నెలకొన్న అనిశ్చితి పరిస్థితితే దీనికి కారణం. అందుకే వీరందరూ దేశం నుంచి తప్పించుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలిపింది.
ఇప్పటికే అఫ్గాన్‌కు చెందిన దాదాపు 22లక్షల మంది విదేశాల్లో శరణార్థులుగా ఉన్నారు. అంతేకాకుండా ఆఫ్గన్ అంతర్యుద్ధం వల్ల ఒక్క ఈ ఏడాదిలోనే 5 లక్షల 58 వేల మంది స్వదేశంలోనే ఒక చోటు నుంచి ఇకో చోటుకు మారారు. వారిలో మహిళలు, చిన్న పిల్లలే ఎక్కువ. కేవలం స్వదేశంలోనే కాకుండా సరిహద్దులు దాటి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయే వారి సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం ఉందని UNHCR తన నివేదికలో పేర్కొంది.
మరోవైపు తాలిబాన్లను నిధుల కొరత వేధిస్తోంది. ఆఫ్గన్‌ని తీవ్ర ఆర్థిక సంక్షోభం వెంటాడుతోంది. కాబూల్‌ని స్వాథీనం చేసుకున్నప్పటి నుంచి విదేశీ నిధులు ఆగిపోయాయి. దాంతో దేశ ఆర్థికవ్యవస్థ కుప్పకూలింది.బ్యాంకుల బయట జనం భారీగా గుమిగూడుతున్నారు.బ్యాంకుల్లో ఉన్న తమ డబ్బును ఎలాగైనా తిరిగి తీసుకోవాలని జనం ప్రయత్నిస్తున్నారు. నిరసనలు కూడా జరుగుతున్నాయి. ముందు ముందు పరిస్థితులు ఏ స్థాయికి దిగజారతాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు.