South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు బిగ్ షాక్ తగిలింది. దేశంలో ఎమర్జెన్సీ విధించిన కేసులో యోల్‌ను అరెస్టు చేసేందుకు అక్కడి న్యాయస్థానం వారెంట్ జారీ చేసింది. అయితే, ఆయనను అదుపులోకి తీసుకునేందుకు వారెంట్ జారీ చేయాల్సిందిగా విచారణ అధికారులు కోర్టును కోరడంతో.. పోలీసుల విజ్ఞప్తిని అంగీకరించి వారెంట్ ఇచ్చింది. దీంతో యోల్‌ను త్వరలోనే అరెస్టు చేసే ఛాన్స్ ఉంది. యోల్ డిసెంబర్3వ తేదీన దేశంలో ఎమర్జెన్సీ విధించడంతో పెనూ సంచలనం రేపింది. ప్రస్తుతం ఈ కేసులో అధ్యక్షుడి యూన్ ని పోలీసులు, రక్షణ మంత్రిత్వ శాఖ, అవినీతి నిరోధక శాఖల అధికారులతో కూడిన బృందం ఎంక్వైరీ చేస్తోంది.
కాగా, ఇప్పటికే ఈ కేసులో మూడుసార్లు పిలిచినప్పటికీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ విచారణకు రాకపోవడంతో పోలీసులు కోర్టును అరెస్ట్ వారెంట్ ఇవ్వాలని కోరారు. ఇక, విచారణలో నేరం రుజువైతే ఆయనకు జీవిత ఖైదు లేదా మరణ శిక్ష విధించే ఛాన్స్ ఉంటుంది. మరోవైపు దేశంలో మార్షల్‌లా విధించినందుకు యూన్ కు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో విపక్షాలు అభిశంసన తీర్మానం పెట్టాయి. కాగా, ఈ తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేయగా 85 మంది మాత్రమే దాన్ని వ్యతిరేకించారు. దీంతో యోల్ తన అధ్యక్ష బాధ్యతలను ప్రధానికి అప్పగించాల్సి ఉంటుంది. తీర్మానం కాపీని పార్లమెంట్ రాజ్యాంగ న్యాయస్థానానికి పంపుతుంది. యోల్ భవితవ్యాన్ని రాజ్యాంగ కోర్టు 180 రోజుల్లోపు తేల్చనుంది.