Terrorist Activities: భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించినందుకు గాను బంగ్లాదేశ్ జాతీయుడికి బెంగళూరులోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టు సోమవారం నాడు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ ఇండియా ఆదేశాల మేరకు భారత్ లో జహీదుల్ ఇస్లాం ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే, దేశంలో ఉగ్రవాద ప్రచారాన్ని మరింతగా పెంచేందుకు మందుగుండు సామాగ్రిని సేకరించడంతో పాటు దోపిడీ, కుట్ర, నిధుల సేకరణ లాంటి నేరాలకు సంబంధించిన కేసుల్లో జహీదుల్ ఇస్లాంకు రూ.57,000 జరిమానా విధించింది కోర్టు. దీంతో పలు కేసుల్లో ఇప్పటి వరకు మొత్తం 11 మంది నిందితులకు శిక్ష పడింది.
అయితే, JMB అధినేత సలావుద్దీన్ సలేహిన్‌తో పాటు తన దేశంలో 2005లో వరుస పేలుళ్లకు పాల్పడి అరెస్టై.. బంగ్లాదేశ్ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న జహీదుల్ ఇస్లాం.. 2014లో భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. అతడితో పాటు అతని సహచరులు 2014 అక్టోబర్ లో బుర్ద్వాన్ పేలుడుకు పథకం వేశారు. దీంతో రంగంలోకి దిగిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పలు ఆధారాలను సేకరించింది. దోపిడీ కేసులతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడంతో జహీదుల్ ఇస్లాం కీలక పాత్ర పోషించాడని తేలింది. అయితే, జహీదుల్, అతని సహాయకులు బెంగళూరుకు పారిపోయి.. అక్కడ భారత వ్యతిరేక కార్యకలాపాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి పశ్చిమ బెంగాల్, అస్సాం నుంచి ముస్లిం యువకులను రిక్రూట్ చేసుకుని ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాడని కనుగోన్నారు. అలాగే, 2018 జనవరిలో బుద్ధగయలో జరిగిన పేలుడు వెనుక జహీదుల్ ఇస్లాంతో పాటు అతని సహచరులు కూడా ఉన్నారని NIA దర్యాప్తులో తేలింది.