Smart Phones At Schools: విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లను ఇవ్వొద్దని.. స్మార్ట్‌ఫోన్ చదువులకు తక్షణమే ఫుల్‌స్టాప్ పెట్టాలని ఐక్యరాజ్య సమితి విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) అన్ని దేశాలకు పిలుపునిచ్చింది. స్మార్ట్‌ఫోన్ల మూలంగా చదువులే కాకుండా సంస్కారం, విద్యార్థుల వ్యక్తిత్వం కూడా దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘విద్యారంగంలో సాంకేతికత-2023’ పేరిట తాజాగా విడుదల చేసిన నివేదికలో యునెస్కో పలు సిఫార్సులు చేసింది. వీటి అమలుకు ఫ్రాన్స్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్ అంగీకరించాయి. కొవిడ్ సమయంలో ఇళ్లలోకి, బడుల్లోకి విచ్చలవిడిగా అడుగుపెట్టిన స్మార్ట్‌ఫోన్లు, గ్యాడ్జెట్ల వల్ల విద్యార్థులకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోందని యునెస్కో అధ్యయనం తేల్చింది. ‘‘మంచి టీచర్లను నియమించకుండా.. కేవలం కంప్యూటర్లు, వాటిలో రికార్డు చేసిన పాఠాలనిస్తే ఫలితం ఉండదు. ఉపాధ్యాయుల పర్యవేక్షణ లేకపోవటంతో విద్యార్థుల్లో చదువు మాని పక్కచూపులు ఎక్కువయ్యాయని స్పష్టం చేసింది. 14 దేశాల్లో చదువులపై స్మార్ట్‌ఫోన్ల ప్రభావాన్ని అధ్యయనం చేసిన యునెస్కో 435 పేజీల నివేదిక విడుదల చేసింది.
Read also: Indigo: ఇండిగో విమానంలో లైంగిక వేధింపులు.. ప్రొఫెసర్ అరెస్ట్
విద్యార్థి కేంద్రంగా.. ఉపాధ్యాయుల ప్రాధాన్యతతో బోధన జరగాలని అందులో సిఫార్సు చేసింది. డిజిటల్ పరికరాల అతి వినియోగం వల్ల పిల్లల సంస్కారం, ప్రవర్తనపై దుష్ప్రభావం పడుతోందని.. సైబర్ వేధింపులు పెరిగాయని పేర్కొంది. అందుకే విద్యారంగంలో డిజిటల్ టెక్నాలజీని ప్రవేశపెట్టడంలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని దేశాల్లోని విద్యా ప్రణాళికవేత్తలను హెచ్చరించింది. అభ్యసనానికి పెద్దపీట వేస్తూ సాంకేతికతను నియంత్రించే పద్ధతులు పాటించాలని యునెస్కో సూచించింది. బోధనలో 30 శాతంకు మించి సాంకేతికతను వినియోగించకుండా చైనాలో కట్టడి చేశారు. విద్యార్థుల మెరుగుదలకు మాత్రమే సాంకేతికత ఉపయోగపడాలి.. దానితోపాటు ఆన్‌లైన్ విద్య అనేది బోధనలో, అభ్యసనలో అదనపు వనరుగా ఉండాలి. అంతేతప్ప ఉపాధ్యాయులకు అవి ప్రత్యామ్నాయం కాదని గుర్తించాలి. పిల్లలకు సాంకేతికతతోనే కాకుండా.. అది లేకుండా జీవించటం కూడా నేర్పాలని యునెస్కో పేర్కొంది.
Read also: Lottery Ticket: లక్కంటే వీళ్లదే.. అప్పు చేసి లాటరీ టికెట్ కొంటే 10కోట్ల జాక్ పాట్
సాంకేతికత అనేది విద్యార్థులు, ఉపాధ్యాయుల మెరుగుదలకు మాత్రమే. వారిని దెబ్బతీయటానికి కాదు. విద్యార్థుల అభ్యసన అనుభవం మెరుగయ్యేందుకు మాత్రమే దీన్ని ఉపయోగించాలి. సాంకేతికతను అమలు చేయటంలో నేర్చుకునేవారి అవసరాలే ప్రధానం కావాలి. ఉపాధ్యాయులకు అవి సహాయకారిగా ఉండాలి. వారు లేకున్నా ఫర్వాలేదన్నట్లు ప్రత్యామ్నాయం కారాదు. సాంకేతికతతో వ్యక్తిగత వెసులుబాటు బాగున్నా.. సామాజికంగా అది కలిగించే దుష్పరిణామాలను పోల్చి చూసుకొని విధాన నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థుల ఆరోగ్యానికి హాని కలగకుండా జాగ్రత్తపడాలి. వ్యాపార ప్రయోజనాలతోపాటు సామాజిక మేలునూ దృష్టిలో ఉంచుకోవాలి. స్పల్ప కాలిక ప్రయోజనాలకంటే… దీర్ఘకాలంలో నష్టాలనూ బేరీజు వేయాలి. విద్యార్థులు, ఉపాధ్యాయుల డేటా, గోప్యత రక్షణకు చట్టాలు చేయాలని యునెస్కో సిఫారసు చేసింది.