Zelenskyy: వైట్ హౌజ్‌లో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోడిమిర్ జెలెన్స్కీ మధ్య వాగ్వాదం ప్రపంచాన్ని షాక్‌కి గురిచేసింది. ఒకరిపై ఒకరు బిగ్గరగా మాట్లాడుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పరిణామాలతో సమావేశంలో పాల్గొన్న దౌత్యవేత్తలతో సహా అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు షాక్‌కి గురయ్యారు. జెలెన్స్కీ అమెరికాని అగౌరపరిచారంటూ, యుద్ధం ఆగడం అతడికి ఇష్టం లేదని ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, అమెరికా ఒక హంతకుడు(పుతిన్)కి మద్దతుగా నిలువొద్దని జెలెన్స్కీ సూచించాడు.
ఇదిలా ఉంటే, ఈ పరిణామాల నేపథ్యంలో యూరోపియన్ నాయకులు జెలెన్స్కీకి అండగా నిలుస్తున్నారు. ఉక్రెయిన్‌కి తాము మద్దతుగా నిలుస్తామని ప్రకటిస్తున్నారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రష్యాను దురాక్రమణదారు అని పిలిచి, గౌరవం కోసం పోరాడుతున్న ఉక్రెయిన్‌కి మద్దతు ఉంటుందని చెప్పారు. స్పెయిన్, పోలాండ్ ప్రధానులు కూడా జెలెన్స్కీకి మద్దతు ప్రకటించారు. జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్, జర్మనీ మరియు యూరప్‌పై ఆధారపడొచ్చని చెప్పారు.
Read Also: AP Inter Exams: నేటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్.. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్
ఘర్షణ తర్వాత జెలెన్స్కీతో ఫోన్‌లో మాట్లాడిన ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మక్రాన్.. రష్యా దురాక్రమణదారు అని, ఉక్రెయిన్ ప్రజలు దురాక్రమణకు గురయ్యారు అని అన్నారు. ‘‘ప్రియమైన అధ్యక్షుడు జెలెన్స్కీ, మీరు ఎప్పటికీ ఒంటరి కారు’’ అని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ స్పందించారు.
స్పానిష్ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్ ‘‘ఉక్రెయిన్, స్పెయిన్ మీతో ఉన్నాయి’’ అని చెప్పగా, పోలిష్ ప్రధాన మంత్రి డొనాల్డ్ టస్క్ ‘‘ప్రియమైన జెలెన్స్కీ, ప్రియమైన ఉక్రేనియన్ మిత్రులారా, మీరు ఒంటరివారు కాదు’’ అని అన్నారు.
ఈ పరిణామాలు అమెరికా, ఉక్రెయిన్‌లకు మంచిది కాదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. ట్రంప్, జెలెన్స్కీతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఇటలీ ప్రధాని జార్జియో మెలోని మాట్లాడుతూ.. నేటి గొప్ప సవాళ్లను ఎదుర్కొనేందుకు అమెరికా, ఈయూ దేశాల భేటీకి ఆమె పిలుపునిచ్చారు. నార్వే ప్రధాన మంత్రి జోనాస్ గహర్ మాట్లాడుతూ.. తీవ్రమైన నిరుత్సాహపరిచే సంఘటనగా అభివర్ణించారు.