Scientists Discover Massive Exoplanet, A ‘Hulk’ Among Super-Earths: భూమి లాంటి గ్రహాలు ఈ విశాల విశ్వంలో ఎక్కడైనా ఉన్నాయనే విషయాలపై అనేక దేశాల అంతరిక్ష సంస్థలు పరిశోధలు చేస్తున్నాయి. పెద్ద పెద్ద టెలిస్కోపులను ఉపయోగించి భూమిలాంటి గ్రహాలను గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు చాలా వరకు భూమిని పోలిన గ్రహాలను గుర్తించారు. అయితే అవన్నీ జీవుల అవసానికి అనువుగా మాత్రం లేదు. అయితే కొన్ని మాత్రం భూమి లాగే నివాసయోగ్యతకు అసవరయ్యే ‘ గోల్డెన్ లాక్ జోన్’లో ఉన్నాయి. తన మాతృనక్షత్రం నుంచి భూమిలాగే ఎక్కువ దూరం కాకుండా.. మరీ సమీపంగా లేకుండా ఉన్నాయి. అయితే ఇవన్ని కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి.
ఇదిలా ఉంటే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తాజాగా మరో ‘సూపర్ ఎర్త్’ని గుర్తించింది. భూమి నుంచి కేవలం 200 కాంతి సంవత్సరాల దూరంలో ఓ భారీ ఎక్సోప్లానెట్ ని గుర్తించారు. టీఓఐ-1075బీగా పిలువబడే ఈ భారీ భూమి తరహా గ్రహం భూమి కన్నా 1.8 రెట్లు పెద్దదిగా ఉంది. ద్రవ్యరాశి పరంగా చూస్తే భూమి కన్నా 10 రెట్లు ఎక్కువ. ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్(టీఈఎస్ఎస్) సహాయంతో నాసా ఈ సూపర్ ఎర్త్ ని కనుక్కుంది. భూమి, శుక్రుడు, బుధ గ్రహాల్లాగే.. ఈ సూపర్ ఎర్త్ కూడా రాతి ఉపరితలాన్ని కలిగి ఉంది. ఇప్పటి వరకు కనుక్కున్న ఎక్సో ప్లానెట్లలో ఇదే భారీ సూపర్ ఎర్త్ కావచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఈ గ్రహంపై మానవుడి బరువు భూమిపై కన్నా మూడు రెట్లు అధికంగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు 1050 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని.. ఉపరితలం అంతా లావాతో కప్పబడి ఉంటుందని చెబుతున్నారు. తన మాతృనక్షత్రానికి అత్యంత దగ్గరగా ఉన్నందువల్లే ఇలాంటి లక్షణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ప్రస్తుతం కనుక్కున్న సూపర్ ఎర్త్ 14.5 గంటల్లో ఒక రోజును పూర్తి చేస్తుంది. హైడ్రోజన్, హీలియంతో కూడిన మందపాటి వాతావరణాన్ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.