ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. అయితే, బాధిత దేశంగా ఉన్న ఉక్రెయిన్‌తో పాటు.. అంతర్జాతీయంగా ఆక్షంల నేపథ్యంలో.. రష్యాలోనూ దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.. నీళ్ల ట్యాంకు దగ్గర బిందెల ఫైట్‌లా కొట్టుకుంటున్నారు. రేషన్ షాపు క్యూలైన్లలో మాదిరి పోట్లాడేసుకుంటున్నారు. తెరవకముందు నుంచే సూపర్ మార్కెట్ల ముందు పడిగాపులు పడి… ఓపెన్ చెయ్యగానే కిందామీదా పడి క్షణాల్లో ఖాళీ చేసేస్తున్నారు. ఇదంతా ప్రస్తుతం రష్యాలో పరిస్థితి.. రష్యాలోని ఓ సూపర్ మార్కెట్ లో చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.. షుగర్ కోసం చాలామంది కస్టమర్లు ఎదురు చూస్తున్నారు.. అయితే, స్టోర్ వాళ్లు ఒక ట్రాలీలో చక్కెర ప్యాకెట్లు తెచ్చారో లేదో… ఒక్కసారిగా ఎగబడ్డారు. మళ్లీ దొరుకుతాయో లేదోనన్న ఆందోళనతో ఒక మహిళ, ట్రాలీలో వున్న ఎక్కువ ప్యాకెట్లను, తన ట్రాలీలో వేసుకుంది. ఒక్కరే అన్ని ప్యాకెట్లు తీసుకుపోతే, తమ పరిస్థితి ఏంటంటూ మిగతా వాళ్లు గట్టిగా నిలదీసి, ఆమె దగ్గర నుంచి షుగర్ ప్యాకెట్లు లాగేసుకున్నారు.
Read Also: YS Sharmila Padayatra: షర్మిల టీమ్‌పై తేనెటీగల దాడి..
మరో సూపర్ సూపర్ మార్కెట్ లో పులిహోర పొట్లాల కోసం ఎగబడినట్టు, పంచదార ప్యాకెట్ల కోసం ఒకరి మీద మరొకరు పడి తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల తిట్లు ముదిరి ముష్టిఘాతాల వరకూ వెళ్తున్నాయి. ఉక్రెయిన్ పై రెచ్చిపోతున్న రష్యాలో, చక్కెర కోసం సాగుతున్న నిరంతర యుద్దాలివి. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం ఈ దృశ్యాలు. ఆంక్షలతో రష్యాలో ద్రవ్యోల్భణం నింగిని తాకుతోంది. షుగర్ రేట్లు రాకెట్ లా దూసుకుపోతున్నాయి. కొందరు వ్యాపారులు కావాలనే రేట్ల కోసం దాచేస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత షార్టేజ్ ఏర్పడుతుందన్న భయంతో, భారీ ఎత్తున కొని ఇంట్లో నిలువ వుంచుకుంటున్నారు జనం. రష్యాలో చక్కెర ఉత్పత్తికి ఎలాంటి ఇబ్బంది లేదంటున్న నిపుణులు, డిమాంండ్ విపరీతంగా పెరగడంతో కొరత ఏర్పడిందంటున్నారు. షుగర్ కొనుగోళ్లు మార్చి నుంచి 6.5 శాతం పెరగడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. దీంతో రష్యాలో డిమాండ్ కు తగ్గట్టు సప్లయి లేదు. మాస్కో, సెయింట్ పీటర్స్ బర్గ్ తో పాటు చాలా నగరాల్లో, ప్రతి కస్టమర్ కు కేవలం పది కేజీల షుగర్ మాత్రమే ఇస్తామని రేషన్ కోటా పెట్టారు. కృత్రిమ కొరత సృష్టించేవారిపై చర్యలు తీసుకుంటామన్న రష్యన్ ప్రభుత్వం, ఆగస్టు 31 చక్కెర ఎగుమతులను నిషేధించింది. కేవలం పంచదారనే కాదు, దాదాపు అన్ని ఆహారపదార్థాలకు రష్యాలో కొరత ఏర్పడుతోంది. అమెరికా, యూరప్ దేశాల ఆంక్షలతో దిగుమతుల్లేవు. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రానున్న రోజుల్లో రష్యాలో ఆకలి మరణాలూ తప్పకపోవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేయడం కలకలం రేపుతోంది.