Russia: ప్రియురాలిపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి దారుణంగా చంపిన వ్యక్తికి రష్యా అధ్యక్షుడు పుతిన్ క్షమాభిక్ష పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వ్లాడిస్లావ్ కన్యస్ తన ప్రియురాలు వెరా పెఖ్తెలేవాను 111 సార్లు కత్తితో పొడిచి, పొడిచి హత్య చేశాడు. బ్రేకప్ చెప్పిందనే కోపంతో అత్యాచారానికి పాల్పడి, మూడున్నర గంటల పాటు చిత్రహింసలకు గురిచేసి చంపేశాడు. చివరకు ఆమె గొంతు కోసేసి చంపేశాడు. ఆమె అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఏడుసార్లు ఫోన్ చేసిన స్పందించలేదు. ఈ నేరంలో అతనికి 17 ఏళ్ల శిక్ష పడింది.
Read Also: Rashmika Mandanna: రష్మిక మందన్న డీప్‌ఫేక్ వివాదం.. వివరాలు ఇవ్వాలని మోటాను కోరిన పోలీసులు..
ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్న ఖైదీలకు రష్యా ప్రభుత్వం క్షమాభిక్ష పెడుతోంది. దీంట్లో భాగంగానే కాన్యుస్‌ని జైలు నుంచి విడుదల చేశారు. ఇటీవల సైనిక యూనిఫాంలో ఉన్న కాన్యూస్ ఫోటోను చూసిన బాధితురాలు వెరా తల్లి ఒక్సానా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇది నాకు పెద్ద దెబ్బ, నా బిడ్డ ఆత్మ కూడా శాంతించదు, నా జీవితంలో ఆశను కోల్పోయానని విలపించింది. అధ్యక్షుడు పుతిన్ తీసుకున్న నిర్ణయం నా జీవితాన్ని ముగించిందని, నాకు ఏమి చేయాలో తెలియడం లేదని ఆక్రోశం వెల్లగక్కింది. రష్యాను రక్షించడానికి అలాంటి క్రూరుడికి ఆయుధాన్ని ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించారు.
ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న దక్షిణ రష్యాలోని రోస్టోవ్ ప్రాంతానికి కాన్యూస్‌ను బదిలీ చేసినట్లు జైలు అధికారులు ధృవీకరించారని మహిళా హక్కుల కార్యకర్త అలియోనా పోపోవా బుధవారం తెలిపారు. నవంబర్ 3న రష్యన్ ప్రాసిక్యూటర్ జనరల్ ఆఫీస్ నుంచి వచ్చిన క్షమాభిక్ష లేఖను ఆమె పంచుకుంది. ఏప్రిల్ 27న ప్రెసిడెంట్ డిక్రీ ద్వారా అతనికి క్షమాభిక్ష పెట్టారు. ఈ నిర్ణయాన్ని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ సమర్థించుకున్నారు. నేరాలకు పాల్పడిన వ్యక్తులు రక్తంతో తమ నేరాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటారని అన్నారు.