రష్యా- ఉక్రెయిన్ యుద్ధ ప్రారంభం అయి దాదాపుగా మూడు నెలలు దాటుతోంది. అయినా రష్యా తన దురాక్రమణను ఆపడం లేదు. ముందుగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను ఆక్రమించుకుందాం అనుకున్న రష్యాకు ఉక్రెయిన్ బలగాలు ఎదురొడ్డి నిలిచాయి. అమెరికా, బ్రిటన్ వంటి నాటో దేశాల ఆయుధ, వ్యూహాత్మక సహాయంతో రష్యాను నిలువరించాయి. దీంతో కీవ్ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లిన రష్యా బలగాలు ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో మారణహోమాన్ని సృష్టిస్తోంది.
తూర్పు ప్రాంతంలోనో డోన్ బాస్ లో రష్యా జెనోసైడ్ ( జాతి నిర్మూలన)కు పాల్పడుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ ఆవేదన వ్యక్తం చేశాడు. రష్యా తన విధానాలను స్పష్టంగా అమలు చేస్తుందని విమర్శించారు.డోన్ బాస్ ప్రాంతాన్ని జనవాసాలు లేకుండా రష్యా దురాక్రమణకు పాల్పడుతోందని జెలన్ స్కీ అన్నాడు. తూర్పు ప్రాంతాన్ని రష్యా బూడిదగా మార్చాలని అనుకుంటుందని ఆరోపించారు. మా ప్రజలను బహిష్కరించడం, సామూహిక హత్యలకు పాల్పడడం రష్యా అనుసరిస్తున్న మారణహోమానికి స్పష్టమైన విధానం అని జెలన్ స్కీ అన్నారు.
ఇదిలా ఉంటే రష్యా, ఉక్రెయిన్ పై భారీగా దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ లో రెండో అతిపెద్ద నగరమైన ఖార్కీవ్ పై జరిగిన దాడిలో 5 ఏళ్ల చిన్నారితో పాటు ఎనిమిది మంది మరణించినట్లు ఉక్రెయిన్ ప్రభుత్వం వెల్లడించింది. తూర్పు ప్రాంతంలోని నగరమైన లైసిచాన్స్క్ పై భారీగా ధాడులు చేసిందని ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న డోన్ బాస్ లోని లుహాన్స్క్ ప్రాంతలో సీవీరోడోనెట్స్క్ ప్రాంతంపై రష్యా బలగాలు పట్టు సాధించాయి. మరోవైపు రష్యా మిత్రదేశం బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో ఉక్రెయిన్ సరిహద్దులకు తనమ సైన్యాన్ని పంపుతున్నట్లు చెప్పాడు. అయితే కీవ్ లోని ఉక్రెయిన్ అధికారులు దీన్ని కొట్టిపారేశారు. అయితే రష్యా బలగాలు బెలారస్ నేలను వాడుకుంటూ ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్నాయని ఉక్రెయిన్ ప్రభుత్వం వెల్లడించింది.