రష్యా ఉక్రెయిన్ పై దండయాత్ర ప్రారంభించి మూడు నెలలు కావస్తోంది. అయినా యుద్ధంలో వెనక్కి తగ్గడం లేదు రష్యా. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలే లక్ష్యంగా విధ్వంసం సృష్టిస్తోంది. గతంలో రాజధాని కీవ్ ను హస్తగతం చేసుకుందామని అనుకున్న రష్యా బలగాలకు ఎదురొడ్డి పోరాడింది ఉక్రెయిన్. కీవ్ ను స్వాధీనం చేసుకోవడం కుదరకపోవడంతో రష్యా, ఉక్రెయిన్ తూర్పు భాగం నుంచి మళ్లీ యుద్ధాన్ని మొదలు పెట్టింది. డాన్ బాస్, లుగాన్స్క్ ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. దీంట్లో భాగంగానే కీలకమైన నగరాలపై బాంబులు, క్షిపణులతో దాడి చేస్తోంది. పారిశ్రామిక నగరమైన సెవెరోడోనెట్స్క్ పై రష్యా తీవ్రంగా దాడి చేస్తోంది.
రష్యా, తూర్పు ప్రాంతంలో ఉన్న ప్రతీ దాన్ని ధ్వంసం చేస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ అన్నారు. రష్యా దాడుల్లో వేలాది మంది ఉక్రెయిన్ ప్రజలు చనిపోగా.. వారందరికి నివాళులు అర్పించారు. ప్రపంచం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు అందివ్వాలని కోరాడు. ఇప్పటికే రష్యా రక్షణ మంత్రి సెర్గీ ఉక్రెయిన్‌తో దీర్ఘకాలిక యుద్ధానికి రష్యా రెడీగా ఉందని హెచ్చరించాడు. రష్యా తూర్పు ప్రాంతమైన డాన్ బాస్ ను పూర్తిగా హస్తగతం చేసుకోవాలని చూస్తోంది. ఈ ప్రాంతం రష్యా వేర్పాటువాదులకు నిలయంగా ఉంది.
ఇదిలా ఉంటే ఉక్రెయిన్ లో శరణార్థి సంక్షోభం కూడా ఎక్కువ అవుతోంది. యుద్ధం వల్ల లక్షలాది మంది ఉక్రెయిన్లు సొంత దేశాన్ని వదిలి యూరప్ లోని రొమేనియా, పోలెండ్ దేశాలకు వలస వెళ్తున్నారు. ఐక్య రాజ్య సమితి నివేదిక ప్రకారం ఇప్పటి వరకు 6 మిలియన్ల మంది ఉక్రెయిన్ ను వదిలారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పుతిన్ అనారోగ్యంతో యుద్ధాన్ని నికోలస్ పెత్రుషేవ్ పర్యవేక్షిస్తున్నారు. పుతిన్ కంటే ఈయన మరింత డేంజరస్ పాశ్చాత్య దేశాలు చెబుతున్నాయి. రాబోయే కాలంలో మరింతగా ఉక్రెయిన్ పై దాడులు పెరిగే అవకాశం ఉంది.