ఉక్రెయిన్ పై విరుచుపడుతోంది రష్యా. ఫిబ్రవరిలో ప్రారంభమై యుద్ధం ఐదు నెలలకు చేరుకుంది. రష్యా ఉక్రెయిన్ భూభాగాన్ని నెమ్మదిగా ఆక్రమిస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ లోని 20 శాతం భూభాగం రష్యా ఆధీనంలోకి వెళ్లింది. ముఖ్యంగా డాన్ బాస్, లుహాన్స్క్ ప్రాంతాలపై రష్యా పట్టు సాధిస్తోంది. అక్కడి నగరాలను నెమ్మదిగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటోంది.
ఇదిలా ఉంటే ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై మరోసారి రష్యా బలగాలు విరుచుకుపడ్డాయి. గత మూడు వారాలుగా కీవ్ పై ఎలాంటి దాడి చేయని రష్యా సేనలు.. ఆదివారం నుంచి కీవ్ పై రాకెట్లతో భీకర దాడులు చేస్తోంది. రెసిడెన్షియల్ భవనాలను టార్గెట్ చేస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. అయితే జర్మనీ వేదికగా జర్మనీ, అమెరికా, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, కెనడా దేశాల జీ – 7 సమావేశం జరుగుతున్న నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఒకరు మరణించగా..నలుగురు గాయపడ్డారు. ఇక ఉత్తర, పశ్చిమ ఉక్రెయిన్ లోని సైనిక క్షేత్రాలపై దాడులు చేస్తున్నామని.. అందులో ఒకటి పోలాండ్ సరిహద్దుల్లో ఉందని రష్యా ప్రకటించింది.
జీ -7 సమావేశానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నారు. ఈ సమావేశం తరువాత నాటో సమావేశంలో కూడా పాల్గొననున్నారు. దీంతో ఉక్రెయిన్ ను భయపెట్టేందుకే రష్యా ఈ దాడికి తెగబడినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. అయితే రష్యాను అడ్డుకునేందుకు తమకు మరిన్ని ఆయుధాలను, సైనిక సహాయాన్ని అందించాలని ఈయూతో పాటు అమెరికాను జెలన్ స్కీ కోరుతున్నాడు. ఇదిలా ఉంటే రష్యాపై మరిన్ని ఆంక్షల్లో భాగంగా ఆ దేశం నుంచి బంగారం దిగుమతి నిషేధంపై జీ-7 దేశాల చర్చించనున్నాయి.