Russia: ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో రష్యా అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే గత రెండు దశాబ్ధాలుగా అధికారంలో ఉన్న అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఎన్నికల తేదీని రష్యా చట్టసభ సభ్యులు నిర్ణయించారు. వచ్చే ఏడాది మార్చి 17, 2024న అధ్యక్ష ఎన్నికలు జరపాలని నిర్ణయానికి ఆమోదం తెలిపారు. మరోసారి పుతిన్ అధ్యక్షుడు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రష్యా అధ్యక్ష ఎన్నికల తేదీ ప్రతిపాదనలను అక్కడి పార్లమెంట్ ఎగువసభ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఫెడరేషన్ కౌన్సిల్ స్పీకర్ వాలెంటీనా మాట్వియోంకో మాట్లాడుతూ.. ఇది దేశంలో ఎన్నికల ప్రచారానికి నాంది పలుకుతుందని చెప్పారు. మరోవైపు ఎన్నికల ప్రక్రియను నిర్వహించేందుకు రష్యా కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం సమావేశం కానుంది.
వ్లాదిమిర్ పుతిన్ గత 20 ఏళ్లుగా రష్యాను పాలిస్తున్నారు. సోవియట్ పాలకుడైన జోసెఫ్ స్టాలిన్ కన్నా ఎక్కువ ఏళ్లు పదవిలో ఉన్న అధ్యక్షుడిగా పుతిన్ చరిత్ర సృష్టించారు. రష్యాలో అధ్యక్షుడి పదవీ కాలం ఆరేళ్లు ఉంటుంది. వచ్చే ఏడాది 2024లో పుతిన్ పదవి ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి పోటీలో నిలబడేందుకు అనుకూలంగా ఓ చట్టాన్ని తీసుకువచ్చారు. దీంతో ఆయన మరో రెండు దఫాలుగా అధ్యక్ష పదవిలో కొనసాగే వీలు కలుగుతుంది. అంటే 2036 వరకు కూడా పుతిన్ పదవిలో కొనసాగే వీలుంది. ఈ రాజ్యాంగ సవరణలకు రష్యా ప్రజలు కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు.