జీ-7 దేశాధి నేతలు జర్మనీలో సమావేశమైన వేళ పుతిన్ సేనలు ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్నాయి. తాజగా క్రెమెన్సోక్ నగరంలోని ఒక షాపింగ్ మాల్ మీద జరిపిన మిస్సైల్ ఎటాక్‌లో 20 మంది చనిపోయారు. 59 మంది గాయపడ్డారు. మరణాల సంఖ్య ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు. ఆ సమయంలో మాల్‌లో దాదాపు 1,000 మంది ఉన్నట్టు సమాచారం. సోమవాం రాత్రి ఈ దాడి జరిగింది.
రష్యా అధీనంలో ఉన్న తూర్పు ఉక్రెయిన్ ప్రాంతానికి 130 కిలోమీటర్ల దూరంలో తాజాగా దాడికి గురైన ఈ క్రెమెన్సోక్ నగరం ఉంది. ఈ పాశవిక చర్యను అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా ఖండించారు. రష్యాపై ఆంక్షలు మరితం తీవ్రతరం చేయాలని జీ-7 దేశాధిపతులను కోరారు. ఇది ఇలావుంటే,జీ7 దేశాల అధినేతలు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. అమాయక ప్రజల మీద దాడులు చేయడం యుద్ధ నేరమే అవుతుందని వారు ఒక ఉమ్మడి ప్రకటన చేశారు. రష్యా మీద మరిన్ని ఆంక్షలు విధించడంపై వారు చర్చిస్తున్న తరుణంలోనే ఈ మిసైల్ దాడి జరిగింది. ఇప్పటికీ ఆ షాపింగ్ మాల్‌లో చాలా మంది ఆచూకీ తెలియడం లేదు. రాత్రి కావడం వల్ల సహాయక చర్యలు కాస్త నెమ్మదించాయని, చీకటిలోనూ బాధితులను కాపాడేందుకు జనరేటర్లు తీసుకువచ్చారు. క్రెమెన్సోక్‌లో షాపింగ్ మాల్ మీద దాడి జరిగిన తరువాత పరిస్థితి భీతావహంగా మారింది. నగరమంతా పొగ కమ్ముకునే ఉంది. మిసైల్ దాడిలో షాపిల్ మాల్ అంతా శిథిలాల కుప్పగా మారింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక బృందాలు ప్రస్తుతం మాల్‌లో మంటలను పూర్తిగా ఆపారు.
క్షిపణి దాడులతో అగ్నికీలలు 10,300 చదరపు మీటర్ల వరకు విస్తరించాయి. మంటలను ఆర్పినా పొగలు ఇంకా వస్తూనే ఉన్నాయి. మరోవైపు, ఈ ఘటన తర్వాత 36మంది పౌరుల ఆచూకీ తెలియడంలేదని పొల్టావా ప్రాంత గవర్నర్ దిమిత్రో లునిన్ తెలిపారు. రాజధాని కీవ్‌ను ఆక్రమించేందుకు తొలినాళ్లలో యత్నించి భంగపడిన పుతిన్ సేన మళ్లీ రాజధానితో సహా పలు నగరాలపై క్షిపణులు ఎక్కుపెట్టింది. ఇప్పటి వరకు సామాన్యులపై దాడులకు పాల్పడలేదు.. ఈ యుద్దంలో సామాన్యులపై ఇదే అతి పెద్ద దాడిగా చెప్పవచ్చు. ఆదివారం తెల్లవారు జామున కీవ్‌పై పుతిన్ సేనలు14 క్షిపణుల్ని ప్రయోగించాయి. ఇంకోవైపు, ఒచాకివ్ నగరంలో మంగళవారం తెల్లవారుఝామున 4గంటల సమయంలో రష్యా సేనలు విరుచుకుపడ్డాయి. సిటీ మార్కెట్, కమ్యూనిటీ సెంటర్, నివాస భవనాలపై జరిపిన దాడుల్లో ముగ్గురు మఅత్యువాత పడ్డారు. వీరిలో ఓ చిన్నారి కూడా ఉన్నట్టు మైకోలైవ్ గవర్నర్ ఒలెక్సాండర్ సింకేవిచ్ తెలిపారు. అలాగే, ఓ చిన్నారితో పాటు ఆరుగురు గాయపడ్డారని వివరించారు.
ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధం మొదలైనప్పట్నుంచి ఇప్పటివరకు 4,731మంది ఉక్రెయిన్ పౌరులు మృతి చెందగా.. మరో 5,900మంది గాయపడినట్టు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఈ దాడుల్లో 330మంది చిన్నారులు ప్రాణాలు కోల్పగా.. 489మంది గాయపడినట్టు పేర్కొన్నారు. మరోవైపు, ఆక్రమణదారులను తిప్పికొట్టి తీవ్రంగా దెబ్బతీస్తున్నట్టు ఉక్రెయిన్ చెబుతోంది. ఇప్పటివరకు 35వేల రష్యా సైనికులను మట్టుబెట్టామని ప్రకటించుకుంది. అలాగే, 1,567 యుద్ధ ట్యాంకులు, 3704 సాయుధ శకటాలు, 217 విమానాలు, 185 హెలికాప్టర్లు 14 నౌకలు, 139 క్రూజ్ మిసైళ్లతో పాటు భారీగా యుద్ధ సామగ్రిని ధ్వంసం చేసినట్టు వెల్లడించింది. యుద్ధ నేరాలకు పాల్పడుతున్న రష్యాను ఉగ్రవాద అనుకూల దేశంగా ప్రకటించాలని జెలన్‌స్కీ పశ్చిమ దేశాలకు మరోమారు విజ్ఞప్తి చేశాడు.