బిలియనీర్, మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ 91 ఏళ్ల వయసులో తన నాలుగో విడాకులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 65ఏళ్ల నటి జెర్రీ హాల్‌తో మర్డోక్ విడాకులు తీసుకుంటున్నట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అమెరికాకు చెందిన ప్రముఖ మోడల్, నటి జెర్రీ హాల్‌ను మర్డోక్ లండన్‌లో 2016లో వివాహమాడారు. ఆరేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పేందుకు ఈ జంట సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జెర్రీ హాల్, రూపర్ట్ ముర్డోక్‌లకు వేర్వేరు వివాహాల ద్వారా 10 మంది పిల్లలు ఉన్నారు.
1956లో ప్యాట్రిసియా బుకర్‌తో ముర్డోక్ మొదటి వివాహం జరగగా… ఆ వివాహం బంధం 1967ముగిసింది. తర్వాత మర్డోక్ అన్నా మారియా టోర్ను రెండవసారి వివాహం చేసుకున్నాడు, ఇది 1967 నుండి 1999 వరకు కొనసాగింది. వెండీ డెంగ్‌ను 1999లో మూడవసారి వివాహం చేసుకున్నాడు.. అది 2013 వరకు కొనసాగింది. 2016లో ‘బ్యాట్‌మాన్’, ‘ది గ్రాడ్యుయేట్’ వంటి హాలీవుడ్ చిత్రాల్లో నటించిన జెర్రీ హాల్‌ను మర్డోక్ వివాహం చేసుకున్నాడు. ఫాక్స్ న్యూస్ ఛానల్, న్యూస్ కార్ప్, వాల్ స్ట్రీట్ జర్నల్ ఇవన్నీ మర్డోక్ కు చెందిన వార్తా సంస్థలు. న్యూస్ కార్ప్, ఫాక్స్ కార్ప్ లో కుటుంబ ట్రస్ట్ ద్వారా మర్డోక్ 40 శాతం వాటా కలిగి ఉన్నారు.
మర్డోక్ కంటే ముందు, జెర్రీ హాల్ గాయకుడు మిక్ జాగర్ను వివాహం చేసుకున్నాడు. జెర్రీ హాల్, రూపర్ట్ మర్డోక్‌లకు వేర్వేరు వివాహాల నుంచి 10 మంది పిల్లలు ఉన్నారు. మర్డోక్ తన నాల్గవ వివాహంతో చాలా సంతోషంగా ఉన్నానని.. ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతుడిగా, సంతోషంగా ఉన్న వ్యక్తిగా తాను కనిపిస్తున్నానని అప్పట్లో ఆయన ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా మీడియా సామ్రాజ్యాన్ని విస్తరించిన మర్డోక్ ఆస్తులు ఫోర్బ్స్ అంచనా ప్రకారం సుమారు 1.38 లక్షల కోట్లు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోని ప్రముఖ వార్తా సంస్థలను మర్డోక్ నిర్వహిస్తున్నారు.