Russia: ఉక్రెయిన్ యుద్ధంలో ఉపయోగించేందుకు రష్యా తన ఆయుధ తయారీని పెంచింది. ముఖ్యంగా హైపర్ సోనిక్ క్షిపణుల తయారీని పెంచాలని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆదేశించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన ఒక రోజు తర్వాత రష్యా అధినేత పుతిన్ శుక్రవారం మాట్లాడుతూ.. మాస్కో హైపర్‌సోనిక్ ఒరెష్నిక్ బాలిస్టిక్ క్షిపణిని పోరాట పరిస్థితుల్లో మరిన్ని పరీక్షలు నిర్వహిస్తుందని చెప్పారు.
Read Also: Bypoll Election Results: 50 స్థానాలకు ఉపఎన్నికలు.. అందరి చూపు వయనాడ్, యూపీ వైపు..
ఇటీవల ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ క్షిపణులను ఉపయోగించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుమతి ఇచ్చాడు. దీంతో ఉక్రెయిన్ ఈ క్షిపణులను రష్యాలోని సుదుర లక్ష్యాలపై దాడులు చేసేందుకు ఉపయోగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధం తీవ్రమైంది. రష్యా గురువారం తెల్లవారుజామున ఉక్రెయిన్ నగరం డ్నిప్రోపై కొత్త తరం ఒరెష్నిక్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ధ్వని కంటే 10 రెట్ల వేగం ‘‘మాక్ 10’’తో ప్రయాణించే ఈ క్షిపణిని భారీ సంఖ్యలో ఉత్పత్తి చేయాలని పుతిన్ ఆదేశించారు.
ఇలాంటి క్షిపణి సాంకేతికత ప్రపంచంలో మరే దేశానికి లేదని పుతిన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ రష్యాపైకి అమెరికా, బ్రిటన్ సరఫరా చేసిన క్షిపణులను ప్రయోగించిన తర్వాత రష్యా ఉక్రెయిన్‌పై బాలిస్టిక్ మిసైళ్లతో దాడులు చేస్తోంది. గురువారం దేశాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడిని పుతిన్.. ఉక్రెయిన్ ఆయుధాలను ఉపయోగిస్తున్న దేశాలకు హెచ్చరికలు చేశారు. ఆ దేశాల సైనిక స్థావరాలపై క్షిపణులతో దాడి చేసే హక్కు రష్యాకు ఉందని ప్రకటించారు. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్‌లను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేశారు.