అమెరికా నుంచి ఇస్తాంబుల్‌కు బయల్దేరిన విమానం మార్గమధ్యలో ఉండగా పైలట్ హఠాత్తుగా ప్రాణాలు వదిలాడు. అయితే వెంటనే న్యూయార్క్‌లో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం యూఎస్ నుంచి టర్కీకి బయల్దేరింది. మంగళవారం అర్థరాత్రి సీటెల్-టకోమా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. విమానం ఉత్తర కెనడా మీదుగా వెళ్తుండగా పైలట్ ప్రాణాలు వదిలాడు. అయితే అతని మరణానికి కారణం మాత్రం ఇంకా తెలియలేదు.
ఇది కూడా చదవండి: IND vs BAN: దంచికొట్టిన తెలుగు కుర్రాడు.. భారత్ భారీ స్కోరు
59 ఏళ్ల పైలట్ ఇల్సెహిన్ పెహ్లివాన్ చనిపోయినట్లు టర్కిష్ ఎయిర్‌లైన్స్ సంస్థ తెలిపింది. విమానం బయల్దేరిన సమయంలో అతడు స్పృహ కోల్పోయినట్లు టర్కిష్ ఎయిర్‌లైన్స్ ప్రతినిది యాహ్యా ఉస్తున్ ప్రకటనలో తెలిపారు. సిబ్బంది అత్యవసర ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. విమానం ల్యాండింగ్ అయ్యేలోపే పైలట్ ప్రాణాలు వదిలినట్లు చెప్పారు. కెన్నెడీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఉదయం 6గంటలకు ల్యాండ్ అయిందని పేర్కొన్నారు. ప్రయాణికులు న్యూయార్క్ నుంచి తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎయిర్‌లైన్స్ ప్రతినిధి తెలిపారు.
పెహ్లివాన్ 2007 నుంచి టర్కిష్ ఎయిర్‌లైన్స్‌లో పని చేస్తున్నాడు. మార్చిలో సాధారణ వైద్య పరీక్షలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు కనిపించలేదని ప్రతినిధి ఉస్తున్ వెల్లడించారు. మా కెప్టెన్‌ను కోల్పోయామని భావిస్తున్నట్లు చెప్పారు. కుటుంబ సభ్యులకు, సహచరులకు సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఉస్తున్ చెప్పారు.
ఇది కూడా చదవండి: Maharashtra: పూణెలో దారుణం.. మహిళను చంపిన చిరుత