PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్‌లో రోడ్డెక్కిన వేలాది మంది

  • పాకిస్తాన్‌లో పెట్రోల్ ధరల మంటలు..
  • పెట్రోల్, నిత్యవసరాల ధరల పెరుగుదలపై ప్రజాగ్రహం..
  • జమాతే ఇస్లామీ నేతృత్వంలో ప్రధాన నగరాల్లో నిరసనలు..
Pak

Pak

PAKISTAN: అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం చేసి అంతర్జాతీయంగా తనను తాను సూపర్ పవర్‌గా భావించుకుంటోంది పాకిస్తాన్. కానీ దేశంలో మాత్రం ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇదే కాకుండా బలూచిస్తాన్, ఖైబర్ ఫక్తుంఖ్వా, పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)ల్లో తిరుగుబాటు ఎదుర్కొంటోంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు పెరుగుతున్న పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలపై ప్రజాగ్రహం తీవ్ర స్థాయికి చేరుతోంది. పెట్రోలియం లెవీ, ద్రవ్యోల్బణాన్ని వ్యతిరేకిస్తూ జమాత్-ఇ-ఇస్లామీ ఆందోళనకు పిలుపునివ్వడంతో వేల సంఖ్యలో ప్రజలు రోడ్ల పైకి వచ్చారు.

కరాచీ, లాహోర్, పెషావర్, క్వెట్టా, ఇస్లామాబాద్, రావల్పిండి, అబోట్టాబాద్ వంటి నగరాల్లో నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. ప్రధాన రహదారులతో పాటు, హైవేలపై ఆందోళనలు చేవారు. లెవీని వెనక్కి తీసుకోవాలి, ఎలాంటి లెవీ లేకుండా రూ. 225కే ఇంధనం ఇవ్వాలి అంటూ నినాదాలు చేశారు. జమాత్-ఇ-ఇస్లామీ అధినేత హఫీజ్ నయీముర్ రెహ్మాన్ ప్రభుత్వ పన్ను విధానాలను తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం పెట్రోలియం పై లెవీ ద్వారా రూ. 8 ట్రిలియన్ల పాకిస్తానీ రూపాయలను వసూలు చేసిందని ఆరోపించారు. మరోవైపు, ఐఎంఎఫ్ లెవీని తగ్గించేందుకు అంగీకరించిందని ప్రభుత్వం చెబుతోంది.

శుక్రవారం జరిగిన నిరసనలు కేవలం ట్రైలర్ మాత్రమే అని జమాతే ఇస్లామీ వార్నింగ్ ఇచ్చింది. అవసరమైనే ఈ నిరసనల్ని దీర్ఘకాలం కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ రెహ్మాన్ తెలిపారు. ఇరాన్ యుద్ధం, ఆర్థిక సంక్షోభం కారణంగా ఏప్రిల్‌లో లీటర్ పెట్రోల్ రూ. 459 పాకిస్తానీ రూపాయలకు చేరింది. భారత కరెన్సీలో చెప్పాలంటే రూ. 157.26. డీజిల్ ధర రూ. 520.35 పాక్ రూపాలయకు చేరింది. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇరాన్ యుద్ధం తర్వాత ఇంధన ధరలు అత్యధికంగా పెరిగిన దేశాల్లో పాక్ రెండోస్థానంలో ఉంది.