Shehbaz Sharif: పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్-రష్యా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-రష్యా సంబంధాలను తాము గౌరవిస్తున్నామని చెప్పారు. చైనాలో జరిగిన ఎస్‌సీఓ సమావేశానికి హాజరైన షరీఫ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. మాస్కోకు న్యూఢిల్లీతో ఉన్న సంబంధాలను ఇస్లామాబాద్ గౌరవిస్తుంది, అవి చాలా బాగున్నాయని మంగళవారం షరీఫ్ అన్నారు. పాకిస్తాన్ కూడా రష్యాతో బలమైన సంబంధాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. పాకిస్తాన్ రష్యాతో బలమైన సంబంధాలు నిర్మించుకోవాలని కోరుకుంటోందని, ఇది ఈ ప్రాంత పురోగతికి, శ్రేయస్సుకు అనుబంధంగా, పరిపూరకంగా ఉంటుందని చెప్పారు. పుతిన్ చాలా డైనమిక్ లీడర్ అని ప్రశంసిస్తూ, ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పాక్ ప్రధాని అన్నారు.
Read Also: India-US Relations: ‘‘మా మద్దతు భారత్‌కే’’: అమెరికా యూదుల సంస్థ..
రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమికి 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇద్దరు నాయకులు చైనాలో జరిగే మిలిటరీ పెరేడ్‌లో పాల్గొన్నారు. వరసగా దౌత్య సమావేశాల్లో భాగంగా పుతిన్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోలతో భేటీ అయ్యారు. అంతకుముందు ఎస్‌సీఓ సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ, పుతిన్‌లు ఒకే కారులో ప్రయాణించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశంలో ఇరువురు నేతలు పాల్గొన్నారు. పుతిన్-మోడీ సమావేశాలు ప్రపంచవ్యాప్తంగా మీడియాలో హైలెట్‌గా నిలిచాయి.