Pakistan hit by petrol shortage: ఆర్థికంగా దివాళా అంచున ఉన్న దాయాది దేశం పాకిస్తాన్ ను వరసగా సంక్షోభాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటే ఆ దేశం అప్పుల కోసం అరబ్ దేశాలతో పాటు ఐఎంఎఫ్ ను సంప్రదిస్తోంది. విదేశీమారక నిల్వలు లేక ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకోలేని పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే నిన్నటి వరకు పాకిస్తాన్ ను విద్యుత్ సంక్షోభం కలవరపెడితే.. తాజాగా పెట్రోల్ సంక్షోభం తెరపైకి వచ్చింది. పాకిస్తాన్ లోని పలు ప్రావిన్సులను పెట్రోల్ కొరత వేధిస్తోంది. పలుచోట్ల పెట్రోల్ బంకుల వద్ద వాహనాల క్యూలు దర్శనం ఇస్తున్నాయి.
Read Also: Pathaan Review: పఠాన్ మూవీ రివ్యూ (హిందీ)
ఆయిల్ మార్కెెటింగ్ కంపెనీలకు సరఫరా తగ్గిన కారణంగా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ తో పాటు ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో పెట్రోల్ కొరత ఏర్పడింది. దిగుమతుల కోసం ప్రైవేట్ బ్యాంకులు క్రెడిట్ లెటర్స్ జారీ చేయడంలో చాలా ఆలస్యం కావడంతో కంపెనీలు ప్రావిన్స్‌కు పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాను తగ్గించాయి. దీంతో ప్రాంతంలో అనేక ఫిల్లింగ్ స్టేషన్లు క్లోజ్ అయ్యాయి. ఇదిలా ఉంటే వచ్చే నెలలో గ్యాస్ సంక్షోభం పాక్ నెత్తిపై ఉంది. ఫిబ్రవరి 6-7 తేదీల్లో రావాల్సిన ఎల్ఎన్జీ కార్గో ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో గ్యాస్ సంక్షోభం తప్పకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే పాకిస్తాన్ లో విద్యుత్ సంక్షోభం నెలకొని ఉంది. గత రెండు రోజులుగా పాకిస్తాన్ లోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ లేదు. లో వోల్టేజ్ కారణంగా గ్రిడ్ వ్యవస్థ కుప్పకూలింది. పాక్ రాజధాని ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్ నగరాల్లో కూడా విద్యుత్ లేకుండా పోయింది. చివరకు పాక్ ప్రధాని కూడా ప్రజలు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.