North Korea: ఉత్తర కొరియా మరో క్షిపణిని పరీక్షించింది. ‘‘సాలిడ్ ఫ్యూయల్’’ ఖండాంతర క్షిపణిని పరీక్షించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా శుక్రవారం వెల్లడించింది. అణు దాడిని ఎదుర్కొనే లక్ష్యంలో ఇది ముందడుగు అని నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అన్నారు. ‘‘హాసాంగ్-18’’ అనే పేరుతో పిలువబడే ఖండాంతర క్షిపణి తమ వ్యూహాత్మక సైనిక శక్తిని పెంచుతుందని, అణుదాడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతుందని కిమ్ అన్నట్లు కేసీఎన్ఏ వార్తా సంస్థ పేర్కొంది.
Read Also: Bihu Dance: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో అస్సాం “బిహూ నృత్యం”
రాజధాని ప్యాంగ్యాంగ్ ప్రాంతం నుంచి 1000 కిలోమీటర్ల మేర క్షిపణి వెళ్లినట్లు, మీడియం రేంజ్ అంతకన్నా ఎక్కువ రేంజ్ ఉన్న బాలిస్టిక్ క్షిపణిని లాప్టెడ్ ట్రాజెక్టరీలో ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం గురువారం గుర్తించింది. ఉత్తర కొరియా అణుక్షిపణులు అన్ని దాదాపుగా ద్రవ ఇంధనంతోనే పనిచేస్తాయి. అయితే భూమి, జలంతర్గాముల నుంచి ప్రయోగించే ఘన ఇంధన ఖండాంతర క్షిపణిని తయారు చేయాలనే చాలా కాలంగా పట్టుదలతో ఉన్నారు కిమ్. తాజాగా ప్రయోగంతో ఆయన కోరిక నెరవేరినట్లు అయింది.
దక్షిణ కొరియా, అమెరికా సైనిక విన్యాసాలను నిర్వహించిన తర్వాత నుంచి ఉత్తర కొరియా ధీటుగా మిస్సైల్ ప్రయోగాలను చేస్తోంది. ఈ ప్రయోగాల వల్ల జపాన్, దక్షిణ కొరియా భయపడుతున్నాయి. అయితే నార్త్ కొరియా మాత్రం తమ రక్షణకు, అమెరికాను అడ్డుకునేందుకే క్షిపణి ప్రయోగాలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఉత్తర కొరియా ఏప్రిల్ 15న అత్యంత ముఖ్యమైన రాజకీయ దినోత్సవాల్లో ఒకటైన ‘‘డే ఆఫ్ సన్’’ని జరుపుకునే ముందు రోజే ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఈ తేదీన ఉత్తర కొరియా వ్యవస్థాపక నాయకుడు కిమ్ ఇల్ సంగ్ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారు.