Zelensky: సుదీర్ఘకాలంగా రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో వేలాది మంది మరణిస్తున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమీర్ జెలెన్‌స్కీ సంచలన ఆరోపణలు గుప్పించారు. నార్త్ కొరియా నుంచి దాదాపు 10 వేల మంది సైనికులు రష్యా తరఫున యుద్ధంలో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారని పేర్కొన్నారు. ఈమేరకు నాటో ప్రధాన కార్యాలయంలో విలేకరులతో జెలెన్‌స్కీ చెప్పారు.
Read Also: Jammu Kashmir Portfolios: సీఎం ఒమర్ అబ్దుల్లా సహా మంత్రులకు శాఖల కేటాయింపు.. ఎవరెవరికి ఏఏ శాఖలంటే..?
అయితే, ఉక్రెయిన్‌పై యుద్ధానికి ఉత్తర కొరియాకు చెందిన వ్యూహాత్మక సైనిక సిబ్బంది, అధికారులను రష్యాకు పంపినట్లు మా నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. నార్త్ కొరియాకు చెందిన 10 వేల మంది సైన్యం వారి స్వదేశంలో శిక్షణ తీసుకుంటున్నారు. మా రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో మూడో దేశం పాల్గొనడం ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక, రష్యాతో యుద్ధం ముగించేందుకు తన విజయ ప్రణాళికను చర్చించేందుకు యూరోపియన్ యూనియన్ నాయకులు, నాటో రక్షణ మంత్రులతో ఉక్రెయిన్ అధ్యక్షుడు బ్రస్సెల్స్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన విజయ ప్రణాళికను అమలు చేస్తే వచ్చే ఏడాదిలోగా ఈ యుద్ధం ముగిసిపోతుందన్నారు. అలాగే, నాటో సభ్య దేశాల్లో సభ్యత్వానికి ఉక్రెయిన్‌కు పూర్తి అర్హత ఉందన్నారు.
Read Also: Ex Minister Harish Rao: మాజీ మంత్రి బంధువులపై చీటింగ్ కేసు నమోదు..
ఇక, జెలెన్‌స్కీ చేసిన ఆరోపణలపై నాటో సెక్రెటరీ జనరల్ మార్క్ రూట్టే రియాక్ట్ అయ్యారు. యుద్ధంలో ఉత్తర కొరియా పాల్గొంటున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధంలో నార్త్ కొరియా రష్యాకు ఆయుధాల సరఫరాతో వారికి సపోర్ట్ చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు అందించే సైనిక, వాయు, రక్షణ వ్యవస్థలు, మందుగుండు సామగ్రి, క్షిపణుల లాంటి సాయాన్ని వేగవంతం చేయాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. నాటోలో ఉక్రెయిన్‌కు స్థానం ఉంది.. కానీ, అది ఎప్పుడు చేరుతుందో చెప్పలేమన్నారు. 32 మిత్ర దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ గెలుపునకు సహకరిస్తాయని నాటో సెక్రెటరీ పేర్కొన్నారు.