ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఏ మాత్రం తగ్గడం లేదు. అమెరికా ఎన్ని సార్లు హెచ్చరికలు చేసినా లెక్క చేయకుండా ఉత్తర కొరియా మాత్రం వరుసగా బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు చేపడుతూనే ఉంది. తాజాగా రాజధాని ప్యాంగాంగ్‌కు సమీపంలోని సునన్ ప్రాంతంలో 35 నిమిషాల వ్యవధిలో 8 స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్షలను నిర్వహించింది. ఒక్కరోజులో ఉత్తర కొరియా ప్రభుత్వం అత్యధిక బాలిస్టిక్ క్షిపణుల పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు.
Monkey Pox: ఫ్రాన్స్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. ఒక్కరోజులోనే 51 కేసులు
మరోవైపు త్వరలోనే ఉత్తర కొరియా మళ్లీ అణు పరీక్షలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై చర్చించడానికి జాతీయ భద్రతా మండలి సమావేశం నిర్వహించనున్నట్లు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ పేర్కొన్నారు. ఇటీవల అమెరికా నావికా దళాలు, దక్షిణ కొరియా సైన్యంతో కలిసి ఫిలిప్పీన్స్ సముద్రంలో సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి. ఇందులో అమెరికా విమాన వాహక నౌక రోనాల్డ్ రీగన్ సైతం పాల్గొంది. 2017 తర్వాత విన్యాసాల్లో ఓ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలోనే ఉత్తరకొరియా వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తోంది. కాగా ఉత్తర కొరియా క్షిపణి పరీక్షల కారణంగా అమెరికా భూభాగానికి, తమ పౌరులకు ఎలాంటి ముప్పు లేదని అమెరికా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.