Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ పోరాటం తీవ్ర యుద్ధంగా మారుతోంది. ఈ యుద్ధంపై ఇప్పటికే అరబ్, ముస్లిం దేశాలు తమ ఆందోళనను వ్యక్తపరిచాయి. అయితే ఇరాన్‌తో సహా పలు అరబ్ దేశాలు ఒత్తిడి పెంచుతున్నప్పటికీ ఇజ్రాయిల్ మాత్రం ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేదు. ఓ వైపు గాజాలోని హమాస్ ఉగ్రవాదులతో యుద్ధం చేస్తూనే మరోవైపు లెబనాన్ హిజ్బుల్లా, యెమెన్ హౌతీ రెబల్స్ తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read Also: Viral Video : ట్రాఫిక్ లో పాట పాడి అలరించిన ఆటో డ్రైవర్.. అదిరిపోయింది కాక..
గాజా స్ట్రిప్ లో భూతల దాడులు ‘‘బాధకరమైన నష్టాలు’’ మిగుల్చుతున్నప్పటికీ.. హమాస్ పై ఇజ్రాయిల్ యుద్ధాన్ని కొనసాగిస్తుందని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు. ‘‘మనకు చాలా ముఖ్యమైన విజయాలు ఉన్నాయి, కానీ బాధకరమైన నష్టాలు కూడా ఉన్నాయి. మనలో ప్రతీ సైనికుడు ముఖ్యమే అని తెలుసు’’ అంటూ నెతహ్యహు ఓ టెలివిజన్ ప్రసంగంలో చెప్పారు. గాజాలో భూతల దాడుల్లో కనీసం 11 మంది సైనికులు మరణించినట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ధృవీకరించిన తర్వాత ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. మేము విజయం సాధించే వరకు పోరాడుతామని ఆయన చెప్పారు. అక్టోబర్ 7 హమాస్ దాడి తర్వాత ఇజ్రాయిల్ ప్రధాని మాట్లాడుతూ.. హమాస్‌ని నేల కూల్చే వరకు తాము విశ్రమించబోమని చెప్పారు.
అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ భూభాగంలోకి ప్రవేశించి 1400 మందిని చంపేశారు. దీని తర్వాత ఇజ్రాయిల్ గాజాపై భీకరదాడులు చేస్తోంది. ముఖ్యంగా ఉత్తరగాజాను టార్గెట్ చేస్తోంది. వైమానిక దాడులతో పాటు భూతల దాడులను కూడా మొదలుపెట్టింది. అయితే ఈ దాడుల్లో సామాన్య పాలస్తీనా ప్రజలతో పాటు ఉగ్రవాదులు కూడా మరణిస్తున్నారు. ఇప్పటికే ఈ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 8 వేలకు చేరింది.