Benjamin Netanyahu: అమెరికా అధ్యక్షుడితో విభేదాలు నిజమే.. ఓపెన్‌గా ఒప్పేసుకున్న ఇజ్రాయెల్ ప్రధాని!

  • ట్రంప్‌తో విభేదాలపై నెతన్యాహు హాట్ కామెంట్స్..
  • ట్రంప్ నా మాట వినరు.. నేను ఆయన మాట వినను
Benjamin Netanyahu

Benjamin Netanyahu

Benjamin Netanyahu: అంతర్జాతీయ రాజకీయ వేదికపై కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు అమెరికా – ఇరాన్ దేశాల మధ్య తెరవెనుక చర్చలు వేగవంతం కాగా.. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకున్న సంబంధాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల జరిగిన అంతర్జాతీయ విధాన కమిటీ సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకున్న దౌత్యపరమైన సంబంధాలపై ఓపెన్‌గా మాట్లాడారు. ఇరు దేశాల మధ్య కొన్ని విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే విషయాన్ని ఆయన అంగీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “అధ్యక్షుడు ట్రంప్ నేను కోరుకున్నవన్నీ చేయరు, అలాగే ఆయన కోరుకున్నవన్నీ నేను చేయను. మేమిద్దరం స్వేచ్ఛాయుత, గర్వించదగిన స్వతంత్ర దేశాలకు నాయకులం. కాబట్టి కొన్నిసార్లు మా ఆలోచనలు, అభిప్రాయాలు భిన్నంగా ఉండటం సహజం” అని నెతన్యాహు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం హమాస్, హిజ్బుల్లా, ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద గ్రూపుల నుంచి ఇజ్రాయెల్ తీవ్రమైన భద్రతా సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ పోరాటంలో అమెరికా నిరంతరం ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్నప్పటికీ, ట్రంప్ ప్రభుత్వం ఇజ్రాయెల్ చేసే అన్ని డిమాండ్లను అంగీకరించడం లేదు. అదే సమయంలో ఇజ్రాయెల్ సైతం అమెరికా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటూనే తన వ్యూహాలను అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో నెతన్యాహు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

×
×
Ad

ఇదిలా ఉంటే అమెరికా – ఇరాన్ మధ్య ముఖాముఖి చర్చలు జరగడం విశేషం. ఇరాన్‌కు చెందిన ప్రముఖ వార్తా సంస్థ ‘తస్నిమ్’ నివేదిక ప్రకారం.. ఇరు దేశాల ప్రతినిధులు దాదాపు 18 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ చర్చల వివరాలను ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వెల్లడిస్తూ.. ఖతార్, పాకిస్థాన్ దేశాలు ఈ చర్చల్లో మధ్యవర్తులుగా వ్యవహరించాయని వెల్లడించారు. ప్రస్తుతానికి ఇరు దేశాల ప్రతినిధి బృందాల చర్చలు ముగిశాయి. అయితే చర్చలు పూర్తిగా ఆగిపోలేదని, తదుపరి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాల బృందాలు రంగంలోకి దిగుతాయని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ 18 గంటల చర్చల్లో అంగీకారానికి వచ్చిన అన్ని అంశాలను ఖతార్, పాకిస్థాన్ దేశాలు త్వరలోనే ఒక అధికారిక పత్రాన్ని జారీ చేయనున్నాయి.

అమెరికా ముందు ఇరాన్ పెట్టిన రెండు ప్రధాన డిమాండ్లు ఇవే..

ఈ చర్చలు సఫలం కావాలంటే తమకున్న రెండు ప్రధాన డిమాండ్లను అమెరికా కచ్చితంగా నెరవేర్చాలని ఇరాన్ గట్టిగా పట్టుబడుతోంది. ఇంతకీ ఆ డిమాండ్లు ఏంటంటే.. ఇరాన్ తన దేశ చమురును అంతర్జాతీయ మార్కెట్లో స్వేచ్ఛగా విక్రయించుకోవడానికి అవసరమైన అనుమతులు ఇవ్వాలి. ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి. అలాగే అమెరికా విధించిన ఆంక్షల కారణంగా వివిధ దేశాల బ్యాంకుల్లో చిక్కుకుపోయిన ఇరాన్‌కు చెందిన బిలియన్ల డాలర్ల నిధులను తక్షణమే విడుదల చేయాలి. ఈ రెండు కీలక సమస్యలు పరిష్కారమైతేనే చర్చలు తదుపరి దశకు వెళ్తాయని ఇరాన్ స్పష్టం చేసింది. తాజా పరిణామాలు మిడిల్ ఈస్ట్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తాయో వేచి చూడాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.