Pakistan: ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్న దాయాది దేశం పాకిస్తాన్ భారీ జాక్‌పాట్ కొట్టింది. పాక్ పంట పండింది. పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లో భారీగా పెట్రోలియం, సహజవాయువు నిక్షేపాలను గుర్తించారు. వీటి ద్వారా పాక్ తన తలరాతను మార్చుకునే అవకాశం ఏర్పడింది. చమురు, గ్యాస్ నిల్వలను కనుగొనేందుకు స్నేహపూర్వక దేశం సహకారంతో మూడేళ్లు సర్వే చేశామని డాన్ న్యూస్ టీవీకి శుక్రవారం సీనియర్ భద్రతా అధికారి చెప్పారు. నివేదికల ప్రకారం.. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద చమురు, సహజవాయువు నిక్షేపాలు ఉన్నట్లు తెలుస్తోంది.
పెట్రోలియం, సమజవాయు నిక్షేపాలను గుర్తించేందుకు జియోగ్రాఫిక్ సర్వేకి పాకిస్తాన్ అనుమతించింది, పాక్ జలాల్లో విస్తారంగా ఉన్న నిల్వల గురించి సంబంధిత అధికారులు పాక్ ప్రభుత్వానికి తెలిపారు. ‘‘బ్లూ వాటర్ ఎకానమీ’’గా పిలిచే ఈ నిక్షేపాల ద్వారా ప్రయోజనం పొందేందుకు అణ్వేషణ, బిడ్డింగ్ ప్రతిపాదన కోసం సమీక్ష నిర్వహిస్తున్నామని, వీటిని వెలికితీయడానికి చాలా ఏళ్లు పట్టొచ్చని, బావులు తవ్వడం, చమురు, సహజవాయువుని వెలికి తీసే ప్రక్రియ దీర్ఘకాలి ప్రయత్నం కావచ్చని, దీనికి మరిన్ని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి అవసరమని సదరు అధికారి వెల్లడించారు.
Read Also: Telugu Indian Idol 3: తెలుగు ఇండియన్ ఐడల్ 3 కంటెస్టెంట్స్ కు పవన్ కల్యాణ్ ప్రశంసలు
ఆయిల్ అండ్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ(ఓగ్రా) మాజీ అధికారి మహ్మద్ ఆరిఫ్ మాట్లాడుతూ.. నిల్వలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, అంచనాలను అందుకుంటాయనే గ్యారెంటీ ఇప్పుడు లేదని చెప్పారు. అణ్వేషణకి 5 బిలియన్ డాలర్ల గణనీయమైన పెట్టుబడి అవసమరి, నిల్వలను వెలికి తీసేందుకు ఐదేళ్లు పట్టొచ్చని వివరించారు. నిల్వల పరిణామం, ఉత్పత్తి యొక్క పునరుద్ధరణ రేటు పాకిస్తాన్ ఇంధన అవసరాలను తీర్చగలవో లేదో నిర్ణయిస్తాయని చెప్పారు. గ్యాస్ నిల్వలు కనుగొనబడితే, ఎల్ఎన్‌పీ దిగుమతుల్ని భర్తీ చేయవచ్చు. చమురు నిల్వలు పాక్ ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించొచ్చని చెప్పారు. అయితే, నిల్వలను సరిగా విశ్లేషించి, అన్వేషన ప్రారంభించే వరకు ప్రస్తుత ఉత్సాహం చాలా వరకు ఊహాజనితమే అని ఆరిఫ్ హెచ్చరించారు.
పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న క్రమంలో ఈ ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. 2022 భారీ వరదలు, వర్షాల తర్వాత పాకిస్తాన్ క్రమక్రమంగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. 2024లో కేవలం 1.7 శాతం వృద్ధి కలిగి ఉంటుందని ఆర్థిక సంస్థలు అంచనా వేశాయి. 2023 నాటికి మొత్తం విదేశీ రుణాలు 126 బిలియన్ డాలర్లకు పైగా ఉండటంతో దేశం అప్పుల పాలైంది. అధిక ద్రవ్యోల్బణం, క్షీణిస్తున్న విదేశీ నిల్వలు, పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్లు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచాయి.