Harish Rao: పోరాటాల పురిటిగడ్డ, తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ లాంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు విధించడం అప్రజాస్వామికం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నిరసన తెలిపే హక్కును హరిస్తూ ఆంక్షలు విధించడం అమానుషం.. ఇది పూర్తి రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని పేర్కొన్నారు. ఓయూలో విద్యార్థుల అక్రమ అరెస్టులను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.. నిరసన చేసే హక్కు ప్రతి పౌరుడికి ఉన్న ప్రాథమిక హక్కు అనే సంగతి కాంగ్రెస్ ప్రభుత్వం మరిచి వ్యవహరిస్తున్నది అని విమర్శలు గుప్పించారు. విద్యార్థులను అణచివేయడం మానుకొని.. వారి సమస్యలు వినాలి, తక్షణం పరిష్కారం చూపాలి అని హరీష్ రావు తెలిపారు.
Read Also: DK Aruna: మా ఇంట్లోకి అగంతకుడు ప్రవేశించడంతో.. భయాందోళనకు గురయ్యాం..
ఇక, ఉస్మానియా యూనివర్సిటీలో విధించిన ఆంక్షల ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని.. అరెస్టు చేసిన విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తిని మళ్లీ తుంగలో తొక్కాలనే కుట్ర జరుగుతోంది.. విద్యార్థుల, యువత ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీయడాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ సహించదు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలను ఇప్పుడే ఉపసంహరించుకోవాలని ఆయన తెలిపారు.