శ్రీలంక సంక్షోభం నేపథ్యంలో రాజవక్స కుటుంబానికి వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ప్రజల ఆగ్రహానికి గురైన గొటబాయ రాజపక్స దేశం దాటి పోరిపోయారు. ఇప్పుడు ఆయన సోదరులైన మాజీ ప్రధాని మహింద రాజపక్స, మాజీ మంత్రి బసిల్ రాజపక్సలు దేశం దాటి వెళ్లరాదని శ్రీలంక సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గొటబాయ రాజపక్స విదేశాలకు పారిపోవడంతో జులై 28 వరకు దేశం దాటి వెళ్లరాదని కోర్టు ఆదేశించింది. మహింద రాజపక్స, బసిల్ రాజపక్సలపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.
శ్రీలంక దేశం ఆర్థికంగా చితికిపోవడానికి రాజపక్స సోదరుల అవినీతి పాలనే కారణమని ప్రజలు విశ్వసిస్తున్నారు. అందుకే వారిని గద్దె దింపేలా నిరసనలు చేపట్టారు. వారి ఆగ్రహానికి మొదట మహింద రాజపక్స ప్రధాని పదవి నుంచి దిగిపోయారు. అనంతరం అధ్యక్షుడిగా ఉన్న గొటబాయను పీఠంపై నుంచి దింపేందుకు కొలంబోలోని అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టారు. ఆ తీవ్రతను గ్రహించిన అధ్యక్షుడు గొటబాయ అధ్యక్ష నివాసాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత మాల్దీవులకు, అక్కడి నుంచి సింగపూర్‌కు పారిపోయారు. సింగపూర్‌కు వెళ్లిన అనంతరం తన రాజీనామాను స్పీకర్‌కు పంపించారు. బసిల్ రాజపక్స కూడా పారిపోదామని ప్రయత్నించగా.. విమానాశ్రయంలో ప్రజలు అడ్డుకోవడంతో దేశంలోనే ఉండిపోవాల్సి వచ్చింది, గొటబాయ రాజపక్స దేశాధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు పార్లమెంటు స్పీకర్ మహింద యాప అబేయవర్దన అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
Karnataka: కిక్ బాక్సింగ్‌లో విషాదం.. సింగిల్ పంచ్‌కు యువ బాక్సర్ మృతి
అనంతరం రణిల్ విక్రమసింఘే తాత్కాలిక అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. నూతన అధ్యక్షుడిని పార్లమెంటు ఎన్నుకునే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తర్వాత రానున్న ఏడు రోజుల్లో నూతన దేశాధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నట్లు స్పీకర్ తెలిపారు. జులై 19న నామినేషన్లు స్వీకరించనున్నామని స్పీకర్ వెల్లడించినట్లు ఓ మీడియా సంస్థ పేర్కొంది. జులై 20 ఎన్నిక జరగనుందని తెలిపింది.